త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ అంటే!

SMTV Desk 2019-08-12 12:20:44  

ఆగస్ట్ 12 బక్రీద్ పండుగను పురష్కరించుకొని ముస్లిం భక్తులు భక్తి శ్రద్ధలతో త్యాగానికి ప్రతీకగా భావించే ఈ పండుగను జరుపుకుంటారు. ఈద్ అల్ అద్హా అని కూడా పిలిచే బక్రీద్ ముందు రోజు ముస్లింలు మరణించిన వారి సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్థాలను ఉంచి పూజిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని వారి నమ్మకం. రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభిస్తారు. సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఖుర్బానీ పేరిట జంతువులను బలిస్తారు. ఖుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలున్నాయి. ఖుర్బానీ ఇవ్వడానికి హజరత్ ఇబ్రహీం అనే ప్రవక్త త్యాగమే కారణమని భావిస్తారు. ఖురాన్ ప్రకారం.. అల్లాహ్ పంపిన ప్రవక్తల్లో ఇబ్రహీం ఒకరు. మక్కా పట్టణాన్ని ఆయనే నిర్మించి నివాస యోగ్యంగా మార్చారు. అల్లాను ఆరాధించడం కోసం ప్రార్థనా మందిరం ‘కాబా’ను నిర్మించి దైవ ప్రవక్తగా ఆయన పేరొందుతారు. ఇబ్రహీం దంపతులకు చాలా కాలం సంతానం కలగదు. లేకలేక పుట్టిన కొడుక్కి ఇస్మాయిల్‌ అని పేరు పెట్టారు. ఇస్మాయిల్ మెడను కత్తితో కోస్తున్నట్టు ఓ రోజు ఇబ్రహీంకు కల వస్తుంది. అల్లా ఖుర్భానీ కోరుతున్నాడమోనని భావించి ఒంటెను బలిస్తారు. కానీ మళ్లీ అదే కల వస్తుంది. దీంతో అల్లాహ్ తన కుమారుడినే బలిదానం కోరుకుంటున్నాడని ఇబ్రహీం భావిస్తారు. ఇదే విషయాన్ని తన కుమారుడికి చెప్పగా.. అల్లా కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని చెబుతాడు. ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టి జుబాహ్‌కు ఇబ్రహీం సిద్ధపడగా.. ఆయన త్యాగానికి మెచ్చిన అల్లాహ్ ప్రాణ త్యాగానికి బదులుగా ఓ జీవాన్ని బలివ్వాలని జిబ్రాయిల్ అనే దూత ద్వారా కోరతాడు. అప్పటి నుంచే బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా మారిందని ముస్లింలు నమ్ముతారు. బక్రీద్ రోజున మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, రెండో భాగం బంధువులకు, మరో భాగం తన కుటుంబం కోసం వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ సందర్భంగా ఖుర్బానీ ఇస్తారు. ముస్లిం క్యాలెండర్ చంద్రుడి గమనం ఆధారంగా సాగుతుంది. ముస్లిం క్యాలెండర్‌లోని చివరి మాసమైన ధు అల్-హిజాహ్ పదో రోజున ఈద్ అల్ అద్హాను జరుపుకొంటారు. అదే సమయంలో హజ్ యాత్ర కూడా జరుగుతుంది. ఈ ఏడాది బక్రీద్ ఆగష్టు 12న వచ్చింది. బక్రీద్ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు.