కోహ్లీ పరుగుల వేటకు పాక్ క్రికెటర్ రికార్డ్ బద్దలు!

SMTV Desk 2019-08-12 12:19:15  

వెస్టిండీస్ పర్యటనలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పరుగుల వేటతో రికార్డుల్ని కనుమరుగు చేశాడు. వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లీ (120: 125 బంతుల్లో 14x4, 1x6) దశాబ్దాలనాటి అరుదైన రికార్డుల్ని బద్దలు కొట్టాడు. మ్యాచ్‌లో 19 పరుగులు చేయడంతోనే 1993లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ పేరిట ఉన్న రికార్డ్‌ని బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. 42వ శతకం బాదడం ద్వారా సచిన్ టెండూల్కర్ (49 వన్డే సెంచరీలు) రికార్డ్‌కి మరింత చేరువయ్యాడు. మ్యాచ్‌లో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ (58 నాటౌట్: 55 బంతుల్లో 5x4)తో కలిసి నాలుగో వికెట్‌కి 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ టీమ్‌కి మెరుగైన స్కోరు అందించాడు. అయితే ఓపెనర్లు శిఖర్ ధావన్ (2: 3 బంతుల్లో), రోహిత్ శర్మ (18: 34 బంతుల్లో 2x4)‌తో పాటు రిషబ్ పంత్ (20: 35 బంతుల్లో 2x4) ఫెయిలైనా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ ఏ దశలోనూ విండీస్ బౌలర్లకి పుంజుకునే అవకాశం ఇవ్వలేదు.