హన్మకొండలో మరో దారుణం

SMTV Desk 2019-08-12 12:18:30  

ఇటీవల వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ప్రవీణ్ అనే వ్యక్తికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించిన వార్త విన్నాము. మళ్ళీ మొన్న శనివారం హన్మకొండలో మరో దారుణం జరిగింది. హన్మకొండలో నానమ్మ వద్ద ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న 15 ఏళ్ళ బాలికను శనివారం సాయంత్రం ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ అవమానం భరించలేక ఆ బాలిక ఆదివారం తెల్లవారుజామున తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం సమ్మయ్య నగర్‌లో నాన్నమ్మతో కలిసి ఉంటున్న ఆ బాలికకు హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన తిరుపతి, ప్రసన్నకుమార్‌లతో పరిచయం ఉంది. వారు డిజేలు నిర్వహిస్తుంటారు. శనివారం మధ్యాహ్నం వారిరువురూ ఆమె ఇంటికి వచ్చి ఏవో మాయమాటలు చెప్పి తమ బైక్‌పై ఎక్కించుకొని పెంబర్తి గ్రామ శివార్లలో గల ఒక నిర్జనప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. అత్యాచారానికి ముందే ప్లాన్ చేసుకునందున అక్కడకు చేరుకున్న వారి మరో స్నేహితుడు రాకేశ్ కూడా ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం వారు ముగ్గురూ ఆమెను అక్కడే వదిలి పారిపోయారు.

ఆ బాలిక ఇంటికి వచ్చి నానమ్మకు జరిగిన విషయం చెప్పుకొని చాలా ఏడ్చింది. మరుసటిరోజు ఉదయం వారితో మాట్లాడుదామని నానమ్మ సముదాయించి పడుకోబెట్టింది. కానీ ఈ అవమానం భరించలేక ఆ బాలిక ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆమె శవాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఆ బాలిక నానమ్మ చెప్పిన ఆధారాలతో రాకేశ్, తిరుపతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసన్నకుమార్ కోసం గాలిస్తున్నారు. ఎన్ని కటినమైన చట్టాలు వచ్చినా...కటిన శిక్షలు విధిస్తున్నా ఈ అత్యాచారాలు ఆగకపోవడం చాలా ఆందోళనకరంగా ఉంది.