కట్టెల పొయ్యి వాడుతున్నారా ఇంకా!

SMTV Desk 2019-08-07 17:32:38  

వంట చేసేందుకు ఇప్పుడు వివిధ రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ తో, ఎలక్ట్రిక్ వస్తువులతో ఇప్పుడు వంట చేసేందుకు వీలుగా ఉంది. కాని పూర్వం ఇవేం లేవు. కేవలం కట్టెల పొయి మాత్రం ఒక్కటే అందరి ఆధారం. ప్రతీ ఊర్లో ఇటువంటి పొయిలే వాడేవారు. కానీ ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేయడం వల్ల శ్వాస సంబంధ సమస్యలను పెంచుతుందని, ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేస్తుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. పూర్వం అంటే...వాళ్ళు ఔషదాలు, ఆహార పదార్థాలు కేవలం సహజసిద్దమైనవే వాడేవారు కాబట్టి వారికి ఏ అనారోగ్య సమస్య వచ్చిన వారి శరీరం తట్టుకునేది. కాని ఇప్పుడు ఇంగ్లీషు మందులు విచ్చల విడిగా వాడుతూ, ఏది పడితే అది తింటూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. దీంతో ప్రతీ దానితో మనకు సమస్య ఏర్పడుతూనే ఉంది. అందులో భాగమే ఇది కూడా. ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల మంది తమ ఇళ్లలో కట్టెలు, బొగ్గు లాంటివి మండించి వంట చేస్తున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. చైనాలో నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం ఘన ఇంధనాలు ఎక్కువ కాలుష్యాన్ని వెలువరిస్తున్నాయి. వీటిలోని సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల లోపలికి చొచ్చుకెళ్తాయి. ఘన ఇంధనాలను వాడటం క్రొనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ) అనే ఊపిరితిత్తుల సమస్యకు దారి తీస్తోందని గతంలోనే పరిశోధనలు వెల్లడించాయి. ఊపిరితిత్తుల పనితీరు మందగించడం, ఆసుపత్రుల పాలవడం, చివరకు చనిపోవడం కూడా జరుగుతుందని చైనాలో తాజాగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఇతరులతో పోలిస్తే కట్టెలు, బొగ్గుల పొయ్యి వాడే వారిలో సీవోపీడీ రెండు మూడు రెట్లు ఎక్కువని పరిశోధకులు తెలిపారు.