భారత్ లో సింధు ఒక్కతే!

SMTV Desk 2019-08-07 17:31:55  

భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అరుదైన మరో ఘనత సాధించింది. ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ మంగళారం విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో భారత్ నుంచి పీవీ సింధు ఒక్కతే చోటు దక్కించుకున్నారు. 2019 సంవత్సరానికి గాను మంగళవారం ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో పీవీ సింధు 13వ స్ధానంలో నిలిచింది. మొత్తం 5.5 మిలియన్ డాలర్ల ఆదాయంతో పీవీ సింధు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న భారత మహిళా అథ్లెట్‌గా నిలిచారు. ఇక, ఈ జాబితాలో టెన్నిస్ గ్రేట్ సెరెనా విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ఫోర్బ్స్ "పీవీ సింధు ఇప్పటికీ భారతదేశంలో అత్యధిక మార్కెట్ కలిగి ఉన్న మహిళా అథ్లెట్‌. 2018 సీజన్ ముగిసే సమయానికి BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ గెలిచిన మొదటి భారతీయురాలుగా నిలిచింది" అని తన ప్రకటనలో పేర్కొంది.ఈ జాబితాలో అమెరికాకు చెందిన టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్సన్ 29.2 మిలియన్ అమెరికన్ డాలర్లతో అగ్రస్ధానంలో నిలిచింది. 37 ఏళ్ల సెరెనా విలియమ్స్ ఇటీవలే "ఎస్ బై సెరెనా" అనే పేరుతో దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిందని ఫోర్స్ పేర్కొంది. దీంతో పాటు 10 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువ చేసే వెంచర్‌ను ప్రారంభింబింది.ఇక, రెండో స్థానంలో 24.3 మిలియన్ అమెరికన్ డాలర్లతో జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా రెండో స్థానంలో నిలిచింది. గతేడాది జరిగిన యుఎస్ ఓపెన్‌ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను ఓడించి ఒసాకా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.జూన్ 2018 మరియు 2019 మధ్యన ప్రైజ్ మనీ, జీతాలు, బోనస్, ఎండార్స్‌మెంట్లు, ప్రదర్శన రుసుముల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందినట్టు ఫోర్బ్స్ తెలిపింది. గతేడాదితో పోలిస్తే టాప్-15 టాప్ అథ్లెట్ల ఆదాయం 130 మిలియన్ అమెరికన్ డాలర్లతో పోలిస్తే 146 మిలియన్ అమెరికన్ డాలర్లకు పెరిగిందని ఫోర్బ్స్ తెలిపింది.