ఆర్టికల్ 370 రద్దు గెజిట్ ను రూపొందించింది ఓ తెలుగు అధికారి

SMTV Desk 2019-08-05 16:26:09  article 370,

ఎంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి జమ్మూకశ్మీర్ కు ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం మోదీ-అమిత్ షా ద్వయం వ్యూహ చతురతకు, సాహసోపేత వైఖరికి నిదర్శనంగా నిలిచింది. రద్దు నిర్ణయాన్ని పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటించడమే కాదు, అప్పటికప్పుడు గెజిట్ విడుదల చేయడం, దానిపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించుకోవడం చకచకా జరిగిపోయాయి. కాగా, ఆర్టికల్ 370 రద్దు గెజిట్ ను రూపొందించింది ఓ తెలుగు అధికారి అని వెల్లడైంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న డాక్టర్ జి.నారాయణరాజు గెజిట్ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు.

కేంద్రం తరఫున చట్టాలు రూపొందించడం నారాయణరాజు ముఖ్య విధుల్లో ఒకటి. 2015లో లెజిస్లేటివ్ సెక్రటరీగా బాధ్యతలు అందుకున్న ఆయన అప్పటినుంచి చట్టాలకు రూపకల్పన చేస్తున్నారు. సీనియర్ లీగల్ సర్వీస్ అధికారిగా నారాయణరాజుకు అపార అనుభవం ఉన్న దృష్ట్యా, కేంద్రం కూడా కీలక చట్టాలు, బిల్లులు, గెజిట్ల రూపకల్పన బాధ్యతలు ఆయనకే అప్పగిస్తోంది.