సింధుకు మళ్ళీ నిరాశే!

SMTV Desk 2019-07-26 15:41:51  

భారత స్టార్ షట్లర్ పివి సింధుకు జపాన్ ఓపెన్ టోర్నీలో కూడా నిరాశే ఎదురయ్యింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ పీవీ సింధు 18-21, 15-21 తేడాతో అకానే యమగుచి (జపాన్‌) చేతిలో ఓడిపోయారు. దీంతో జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. తొలి గేమ్‌ ఆరంభంలో సింధు ఆధిక్యంలో నిలిచినప్పటికీ ఆపై ఒత్తిడికి లోనై వరుసగా పాయింట్లు కోల్పోయింది. దీంతో తొలి గేమ్‌ను సింధు 18-21తేడాతో కోల్పోయింది. ఇక రెండో గేమ్‌ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఒకానొక సమయంలో ఇద్దరూ 4-4తో సమంగా నిలిచినప్పటికీ ఆ తర్వాత యామగుచి సింధుపై పైచేయి సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కాగా, ఇటీవలే ఇండోనేసియా ఓపెన్‌ ఫైనల్లో సైతం పీవీ సింధు యామగుచిని చేతిలోనే ఓడిపోవడం విశేషం. మరవైపు పురుషుల క్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత షట్లర్‌ సాయిప్రణీత్‌ అదరగొట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్తో 21-12, 21-15పై సునాయాస విజయం సాధించాడు. దీంతో సాయి ప్రణీత్ జపాన్‌ ఓపెన్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌ని సాయి ప్రణీత్ 36 నిమిషాల్లోనే ముగించడం విశేషం. ఈ విజయంతో జపాన్ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్ నుంచి సాయి ప్రణీత్‌ ఒక్కడే ఇప్పటి వరకు సెమీస్‌కు చేరిన ఆటగాడిగా నిలిచాడు.