తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

SMTV Desk 2019-07-26 15:33:22  jagan, kcr, supreme court

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలపై మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వకపోతే ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు సుప్రీం కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది. గతంలోనే దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు రెండు రాష్ట్రాలను ఆదేశించింది. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా కోరాయి. దీంతో తాజాగా విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.