బీసీసీఐలో క్రికెటర్ల కోసం ప్రత్యేక సంఘం

SMTV Desk 2019-07-24 16:10:24  

భారత జట్టు క్రికెటర్ల కోసం ప్రత్యేక సంఘం ఏర్పడనుంది. ఈ మేరకు బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం...భారత క్రికెటర్ల సంఘం(ఐసీఏ)ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంఘంలో మాజీ క్రికెటర్లు (పురుషులు, మహిళలు) మాత్రమే సభ్యత్వానికి అర్హులు. 2013లోని సెక్షన్‌ 8 ప్రకారం భారత మాజీ క్రికెటర్ల కోసం ఏర్పాటైన ఇండియన్‌ క్రికెటర్ల అసోసియేషన్‌ (ఐసీఏ)ను బీసీసీఐ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఇది మినహా మరే సంఘానికి బోర్డు గుర్తింపు ఉండదు అని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐతో సంబంధం లేకుండా ఐసీఏ స్వతంత్రంగా పని చేస్తుంది. అయితే ఆరంభంలో బీసీసీఐ బోర్డు నుంచి కొంత ఆర్థిక సహాయం అందుతుంది. ఆ తర్వాత మాత్రం ఐసీఏ సొంత ఆదాయ మార్గాలు చూసుకోవాలని బోర్డు సూచింది.ఐసీఏకు ఎన్నికలు నిర్వహించే వరకు కపిల్‌ దేవ్, అజిత్‌ అగార్కర్, శాంత రంగస్వామి డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. ఈ సంఘంలో మాజీ క్రికెటర్లకు మాత్రమే సభ్యత్వం ఇస్తారు. ప్రస్తుతం జాతీయ జట్లకు ఆడుతున్నక్రికెటర్లు సభ్యత్వానికి అనర్హులు. అయితే ఇతర దేశాల్లో మాత్రం ప్రస్తుతం జాతీయ జట్లకు ఆడుతున్న వారికి కూడా సభ్యత్వం కల్పిస్తున్నారు.ఐసీఏలో మాజీ క్రికెటర్లు సభ్యత్వం పొందేందుకు బీసీసీఐ కొన్ని ప్రమాణాలను కూడా విధించింది. ఏ ఫార్మాట్‌లోనైనా కనీసం ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన పురుష, మహిళల మాజీ క్రికెటర్లు మాత్రమే సభ్యత్వం పొందేందుకు అర్హులు. ఇది కాకుండా ఏ ఫార్మాట్‌లోనైనా కనీసం పది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన పురుషులు, ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మహిళలు కూడా సభ్యత్వం పొందొచ్చట.