షూ ధర 3 కోట్లా!

SMTV Desk 2019-07-24 16:05:57  

వేలంపాటలో ఓ జత షూలు రికార్డు ధర పలికాయి. ఇంతకి ఆ షూ స్పెషాలిటీ ఏంటి అంటే...అమెరికాకు చెందిన షూ మేకర్ నైక్ దాదాపు 5దశాబ్దాల క్రితం తయారు చేసిన బూట్లను వేలం వేస్తే రికార్డు ధర పలికింది. 1972లో మూన్ షూ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చిన ఈ స్నీకర్స్‌ను సోథిబై సంస్థ వేలం వేయగా ఏకంగా 4,37,500 డాలర్లు పలికింది. అంటే ఇండియన్ కరెన్సీలో దాని విలువ దాదాపు రూ.3కోట్ల పైమాటేనన్న మాట.కెనడాకు చెందిన మైల్స్ వాదల్ అనే వ్యక్తి సోథిబై ఆన్‌లైన్ యాక్షన్‌లో ఈ షూస్‌ను దక్కించుకున్నారు. గతవారంలోనే ఆయన అత్యంత అరుదైన 99 జతల షూస్‌ను కొనుగోలు చేశారు. వాటి కోసం ఆయన 8,50,000 డాలర్లు ఖర్చు చేశారు. వేలంతో దక్కించుకున్న నైక్ మూన్ షూస్‌తో కలిసి ఆయన ప్రైవేట్ మ్యూజియంలో వాటిని ప్రదర్శనకు ఉంచనున్నారు.తాజాగా సోథిబైలో రికార్డు స్థాయి రేటుకు అమ్ముడుపోయిన షూస్‌ను 1972లో తయారు చేశారు. ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనే రన్నర్ల కోసం నైక్ కో ఫౌండర్ బిల్ బోవర్‌మన్ మూన్ షూను డిజైన్ చేశారు. అప్పట్లో కేవలం 12 జతలు మాత్రమే తయారు చేసిన ఈ షూస్‌లో ఒక దాన్ని సోథిబై వేలం వేసింది.వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన నైక్ షూస్ సరికొత్త ప్రపంచరికార్డు నమోదుచేశాయి. 1984 ఒలింపిక్స్ బాస్కెట్ బాల్ ఫైనల్స్ సమయంలో బాస్కెట్ బాల్ ప్లేయర్ మైఖేల్ జోర్డాన్ వేసుకున్న కాన్‌వర్స్ స్నీకర్స్‌ను 2017లో వేలం వేశారు. అప్పట్లో సోథిబై నిర్వహించిన ఈ యాక్షన్‌లో ఆ షూస్ 1,90,373 డాలర్లకు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఇదే ప్రపంచరికార్డ్ కాగా.. నైక్ మూన్ షూస్ ఆ రికార్డు బ్రేక్ చేసింది.