విరాట్‌తో పోల్చితే రోహిత్ చాలా బెటర్

SMTV Desk 2019-07-23 11:03:43  rohit, sharma, Virat Kohli,

ముంబై : టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి కంటే రోహిత్ శర్మనే సమర్థుడని, అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించడం మంచిదని అభిమానులు సూచిస్తున్నారు. కెప్టెన్‌గా విరాట్‌తో పోల్చితే రోహిత్ చాలా బెటర్ అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టిన నేపథ్యంలో కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. కోహ్లిని టెస్టుల్లో కెప్టెన్‌గా ఉంచి పరిమిత ఓవర్లలో రోహిత్ సారథ్యం అప్పగిస్తే జట్టుకు ప్రయోజనంగా ఉంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తాజాగా వెస్టిండీస్‌తో జరుగనున్న సిరీస్‌లో మూడు ఫార్మాట్‌లకు కూడా కోహ్లినే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. దీనిపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్‌గా తరచూ విఫలమవుతున్నా కోహ్లిని తొలగించక పోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే భారత్ ఇంటిదారి పట్టడంలో కోహ్లి వ్యవహరించిన తీరే ప్రధాన కారణమనే విమర్శలున్నాయి. జట్టును సరైన దిశలో నడిపించడంలో కోహ్లి విఫలమవుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు.

కోహ్లితో పోల్చితే రోహిత్ సారథ్యం చాలా బాగుంటుందని, పరిస్థితులకు తగినట్టు మార్పులు చేయడంలో అతను ఎంతో పరిణితితో వ్యవహరిస్తాడని వారు పేర్కొంటున్నారు. రోహిత్ సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ చాలా సార్లు ఐపిఎల్ ట్రోఫీని సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అదే విరాట్ కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా ట్రోఫీని గెలవని విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. డివిలియర్స్, మనీష్ పాండే, గేల్, యువరాజ్, రాహుల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించారని, అలాంటి స్టార్లు ఉన్న సమయంలో కూడా బెంగళూరు ఒక్కసారి కూడా ఐపిఎల్‌ను గెలవలేదని వారు ఉదాహరిస్తున్నారు. బెంగళూరు పేలవమైన రికార్డుకు కోహ్లి సారథ్యం కారణమని వారు పేర్కొంటున్నారు. జట్టును ముందుండి నడిపించడంలో కోహ్లి అంతగా సఫలం కావడం లేదని వారు అంటున్నారు. బ్యాట్స్‌మన్‌గా కోహ్లి ఎదురులేని శక్తి అనడంలో సందేహం లేదని, అయితే సారథిగా మాత్రం అతను అంతగా సక్సెస్ కావడం లేదని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.

రానున్న ట్వంటీ20 ప్రపంచకప్ నేపథ్యంలో రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లి బ్యాట్స్‌మన్‌గానే రాణిస్తుండగా, రోహిత్ ఇటు బ్యాటింగ్‌లో, అటు కెప్టెన్‌గా మంచి రికార్డు కలిగి ఉన్నాడని వారు పేర్కొంటున్నారు. ఇక, కీలక సమయంలో కోహ్లి తీసుకునే నిర్ణయాలు కూడా జట్టుకు ప్రతికూలంగా మారుతున్నాయనే అభిప్రాయం కూడా నెలకొంది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో మహ్మద్ షమిని ప్రక్కన పెట్టి కోహ్లి పెద్ద పొరపాటే చేశాడని, అంతేగాక కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్‌ను బరిలోకి దించక పోవడం కూడా జట్టు ఓటమికి ప్రధాన కారణమని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయం. కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ఉన్నప్పుడూ ఎంతో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకునే వాడని, అయితే కోహ్లిలో ఆ మెళకువలు కనిపించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అదే రోహిత్ కెప్టెన్‌గా ఉంటే పరిస్థితులకు తగినట్టు నిర్ణయాలు తీసుకుంటాడని వారు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు విరాట్‌కు బదులు రోహిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని కోరుతూ వేలాది మంది అభిమానులు ట్విటర్ వేదికగా బోర్డు అధికారులను కోరుతున్నారు. కోహ్లిని కేవలం టెస్టులకు మాత్రమే సారథిగా ఉంచాలని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్‌కు బాధ్యతలు అప్పగించాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా బిసిసిఐ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కోహ్లి అసాధారణ బ్యాట్స్‌మన్ అయినా కూడా కెప్టెన్‌గా మాత్రం జీరోనే అని వారు తమ ట్విట్‌లో పేర్కొంటున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రోహిత్‌కు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతలు అప్పగించాలని వారు సూచిస్తున్నారు.