తెలుగు టైటాన్స్‌కు కొత్త కెప్టెన్!

SMTV Desk 2019-07-18 15:44:03  pro kabaddi league 7, telugu titans, Abozar Mighani

ప్రొకబడ్డీ సీజన్‌-7 ఈ నెల 30న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా జట్లు టైటిల్‌ సాదించేందుకు కొత్త కెప్టెన్‌లకు బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు టైటాన్స్‌ జట్టు కెప్టెన్‌గా ఇరాన్‌ డిఫెండర్‌ అబొజర్‌ మిఘానిని ఫ్రాంచైజీ యాజమాన్యం నియమించింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో తెలుగు టైటాన్స్‌ యాజమాన్యం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్త కెప్టెన్‌ను అధికారికంగా ప్రకటించారు.గతకొంత కాలంగా తెలుగు టైటాన్స్‌ జట్టుకు ఆడిన స్టార్‌ ఆటగాడు రాహుల్‌ చౌదరి ఈ సారి లేడు. రాహుల్ లేకపోయినా జట్టుకు ఢోకా లేదని టైటాన్స్‌ జట్టు యజమాని శ్రీనివాస్‌ శ్రీరామనేని తెలిపారు. స్వదేశీ, విదేశీ ఆటగాళ్ల సమాహారంతో జట్టు ఈసారి పటిష్ఠంగా కనిపిస్తున్నది. టైటిల్‌పై గురిపెట్టాం. ఆరంభం నుంచే ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తామన్నారు. జులై 20న తెలుగు టైటాన్స్‌, యుముంబా మధ్య మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. పన్నెండు జట్ల మధ్య టోర్నీని ఈసారి డబుల్‌ రౌండ్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు. అన్ని జట్లు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడతాయి. లీగ్‌ దశ ముగిశాక తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ప్లేఆఫ్స్‌ నిర్వహిస్తారు. ఈ పోటీలు వివిధ నగరాల్లో సుమారు మూడు నెలల పాటు జరుగుతాయి. అక్టోబర్‌ 19న గ్రేటర్‌ నోయిడాలో జరిగే ఫైనల్‌తో ఏడో సీజన్‌ ముగుస్తుంది.