ఆమెను వంట చేయకుండా 30ఏళ్ళు ద్వీపంలో బందీగా ఉంచారు!

SMTV Desk 2019-07-11 14:56:58  mary mallon typhoid

ఉత్తర ఐర్లాండ్‌లో టైఫాయిడ్ అంటే వారికి గుర్తొచ్చేది మేరీ మల్లాన్. అక్కడ ఈమె పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ఇంతకి అ వ్యాధికి ఈమెకు ఏం సంభంధం. ఆమె ఏమైనా టైఫాయిడ్ కు నివారణ కనిపెట్టిందా అంటే పొరపాటే. ఎందుకంటే ఆమె టైఫాయిడ్ వ్యాధిని ఇతరులకు వ్యాపించేది. అలా ఈమెపై భయం పుట్టుకొచ్చింది. మేరీ మల్లాన్ గురించి తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. మేరీ 1869, సెప్టెంబర్ 23న ఉత్తర ఐర్లాండ్‌లోని కూక్స్‌టౌన్ అనే గ్రామంలో జన్మించింది. ఆమెకు వంట చేయడమంటే చాలా ఇష్టం. అందుకే, ఆమె వంటనే వృత్తిగా మలచుకుంది. దురదృష్టం ఏమిటంటే.. ఆమె వంటను ఎవరు తిన్నా టైఫాయిడ్‌కు గురయ్యేవారు. దీంతో ఆమెకు ‘టైఫాయిడ్ మేరీ’గా పేరొచ్చింది. అయితే, ఆమె మాత్రం ఏనాడు టైఫాయిడ్‌కు గురికాకపోవడం గమనార్హం. టైఫాయిడ్ వ్యాధి పురాతన కాలం నుంచే ఉనికిలో ఉంది. 1900 సంవత్సరంలో పరిశోధకులు ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాన్ని కనుగొన్నారు. ఈ బ్యాక్టీరీయా మలం ద్వారా లేదా అపరిశుభ్రంగా ఉండటం వల్ల వ్యాప్తి చెందుతుందని తెలుసుకున్నారు. అయితే, ప్రపంచంలో టైపాయిడ్‌ను వ్యాప్తి చేసిన తొలి వ్యక్తిగా మేరీ పేరు నిలిచిపోతుంది. ఆమె టైఫాయిడ్‌కు గురికాకున్నా.. ఆ వ్యాధిని మాత్రం వ్యాప్తి చేసేది. ఈ విషయం తొలుత ఎవరికీ అంతుబట్టలేదు. చివరికి మేరీకి కూడా దీనిపై అవగాహన లేదు. 1906లో చార్లెస్ హెన్రీ వారెన్ అనే వ్యక్తి, మరో పదిమంది కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంట్లో ఆరుగురు టైఫాయిడ్ వ్యాధికి గురయ్యారు. అప్పటికి ఆ ప్రాంతంలో టైఫాయిడ్ ఉనికిలో లేదు. దీంతో ఈ వ్యాధి వారికి ఎలా సోకిందో అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో వారెన్‌ తన స్నేహితుడు, సివిల్ ఇంజినీర్ జార్జ్ సాపర్‌కు ఈ విషయం చెప్పాడు. తమ కుటుంబానికి ఈ వ్యాధి ఎలా వ్యాపించిందో తెలుసుకోవాలని కోరాడు. హెన్రీ ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంటుంది. దీంతో అపరిశుభ్రత వల్ల ఆ వ్యాధి ఏర్పడే అవకాశం లేదు. ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వ్యక్తి.. వంట మనిషి మేరీ మాత్రమే. అయితే, ఆ ఇంట్లోవారు టైఫాయిడ్‌కు గురైన వారం రోజుల్లోనే ఆమె ఆ ఉద్యోగం వదిలిపెట్టింది. దీంతో సాపర్ ఆమె గురించి ఆరా తీశాడు. వంట మనిషి మేరీ ఎక్కడా పూర్తిగా పనిచేయదని, ఎప్పుడూ ఉద్యోగం మారుతూనే ఉంటుందని తెలుసుకున్నాడు. అంతేకాదు, ఆమె పనిచేసే ప్రాంతాల్లో టైఫాయిడ్ వ్యాపిస్తుందనే విషయం తెలిసి షాకయ్యాడు. దీంతో సాపర్ ఆమె ఆచూకీ కనుగొని పోలీసులకు అప్పగించాడు. టైఫాయిడ్ నుంచి ప్రజలను రక్షించేందుకు మేరీని న్యూయార్క్ సముద్రం తీరానికి శివారులో గల నార్త్ బ్రదర్ ద్వీపంలో బంధించారు. ఈ శిక్షను మేరీ వ్యతిరేకించింది. తన వల్ల టైఫాయిడ్ వ్యాపిస్తోందనేది అపోహ మాత్రమేనని వాదించింది. ‘‘నాలో టైఫాయిడ్‌కు చెందిన ఎలాంటి బ్యాక్టీరియా లేదని వైద్యులు చెప్పారు. నేను నిర్దోషిని, ఏ నేరం చేయకపోయినా నన్ను క్రిమినల్‌లా చూస్తున్నారు’’ అని ఆమె వాపోయింది. దీనిపై ఆమె న్యూయార్క్ స్టేట్ బోర్డ్ ఆఫ్ హెల్త్‌కు కూడా ఫిర్యాదు చేసింది. 1910లో తాను మళ్లీ వంట చేయనని, సాధారణ జీవితం గడుపుతానని మేరీ కోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో ఆమెను కొన్ని షరతులతో విడుదల చేశారు. మేరీ కొన్నాళ్లు వంట చేయకుండా లాండ్రీలోనే పనిచేసింది. అయితే, అక్కడ జీతం చాలా తక్కువగా ఇచ్చేవారు. పైగా, వంటకి దూరంగా ఉండటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. దీంతో ఆమె ఆ ఉద్యోగం వదిలేసి, మళ్లీ కుక్‌గా మారింది. తన పేరును మేరీ బ్రౌన్‌గా మార్చుకుని స్లోనే మహిళా ఆసుపత్రిలో వంట మనిషికి చేరింది. 1915లో ఆ ఆసుపత్రిలోని 22 మంది వైద్యులు, నర్సులు టైఫాయిడ్‌కు గురయ్యారు. వారిలో ఇద్దరు చనిపోయారు. దీంతో పోలీసులు మళ్లీ మేరీని అరెస్టు చేశారు. మరోసారి ఆమెను మనుషుల్లేని ద్వీపానికి తరలించారు. అక్కడ ఆమె సుమారు 30 ఏళ్లు జీవించింది. చనిపోడానికి ఆరేళ్ల ముందు ఆమె పక్షవాతానికి గురైంది. నవంబరు 1938, నవంబరు 11న 69 ఏళ్ల వయస్సులో న్యుమోనియాతో చనిపోయింది. అయితే, ఆమె టైఫాయిడ్‌కు గురికాకుండా దాన్ని ఎలా వ్యాప్తి చేసిందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఆమె వంటకు ముందు చేతులు శుభ్రం చేసుకునేది కాదని, అందుకే టైఫాయిడ్ వ్యాప్తి చెందిందనేది చాలామంది వాదన.