పింఛన్‌ డబ్బు కోసం తండ్రిని చంపిన కొడుకు

SMTV Desk 2019-07-11 14:53:18  

ఫించన్‌ డబ్బులు అడిగితే ఇవ్వడం లేదన్న కోపంతో మద్యం మత్తులో తండ్రిపై దాడి చేయడమేకాక, అతని గొంతు నులిమి హత్యాయత్నం చేశాడో ప్రబుద్ధుడు. తీవ్రంగా గాయపడి ఆపస్మారక స్థితికి చేరుకున్న వృద్ధుడిని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. కృష్ణా జిల్లా చందర్లపాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన షేక్‌ మహబూబ్‌సాహెబ్‌ (75) కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు.

ఈనెల 8వ తేదీన ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌ కింద అందించిన 2,250 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి అతని రెండో కొడుకు సిలార్‌సాహెబ్‌ పూటుగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. తండ్రిని డబ్బు కోసం అడిగాడు. అతను ఇవ్వడానికి నిరాకరించడంతో తండ్రిపై దాడి చేశాడు. అనంతరం అతని గొంతునులిమి హత్య చేసేందుకు ప్రయత్నించాడు.

అపస్మారక స్థితికి చేరుకున్న షేక్‌ మహబూబ్‌సాహెబ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. మృతుడి పెద్ద కుమార్తె మస్తాన్‌బీ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.