రేపు బడ్జెట్...సీతరామన్ ముందు పెను సవాళ్ళు

SMTV Desk 2019-07-04 11:55:16  nirmala sitaraman, central finance minister, budget 2019

రేపు పార్లిమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై అందరి దృష్టి ఉంది. దీంతో రక్షణ మంత్రిగా విధులు నిర్వహించి మళ్ళీ ఆర్థిక మంత్రిగా భాధ్యతలు చేపట్టిన సీతరామన్ కు ఇది పెద్ద సవాలుగా మారింది. మరో వైపు జిడిపి గణాంకాలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. గత త్రైమాసికంలో చైనాతో పోటీపడే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న మన ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. జనవరిమార్చి కాలంలో జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 5.8 శాతం నమోదు చేసింది. రెండేళ్లలో తొలిసారి చైనా దిగువకు మన జిడిపి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో జిడిపి వృద్ధి రేటు వరుసగా 7.1 శాతం, 6.6 శాతం, 5.8 శాతం నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో అంచనాల కంటే దిగువకు వృద్ధి రేటు పడిపోయింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం(201819)లో జిడిపిలో కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) 57.2 బిలియన్ డాలర్లు లేదా 2.1 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో 1.8 శాతంగా ఉంది. ఇది 201718 ఆర్థిక సంవత్సరంలో 48.7 బిలియన్ డాలర్లుగా ఉంది. 201819 ఆర్థిక సంవత్సరానికి లోటు పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో 27.7 బిలియన్ డాలర్లు (2.7 శాతం)తో పోలిస్తే మార్చి త్రైమాసికంలో 4.6 బిలియన్ డాలర్లు( 0.7 శాతం)గా ఉంది. గత కొన్ని త్రైమాసికాలుగా దేశీయ ఆర్థిక వ్యవస్థ స్వల్పంగా మందగమనం దిశగా పయనిస్తోంది.ఆటోమొబైల్ నుంచి రోజువారీ అవసరాలు, వినియోగం తగ్గడం, నిరుద్యోగ రేటు పెరగడం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగడం, దేశీయ బ్యాంకులు నిరర్థక ఆస్తులను తగ్గించుకునే పనిలో ఉండడం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు ద్రవ్యకొరత వంటివి ఆర్థికమంత్రి ముందున్న సవాళ్లు. ఈ నేపథ్యంలో సీతారామన్ వినియోగం, వృద్ధికి ఊతం అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది.