బిఎస్‌ఎన్‌ఎల్ కోసం రూ.2500 కోట్ల టర్మ్ లోన్ కు కేంద్రం ప్రయత్నాలు

SMTV Desk 2019-06-25 15:41:21  bsnl, central government

ప్రభుత్వ రంగ దిగ్గజ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ను ఆర్ధిక సంక్షోభం నుండి బయట పడేసేందుకు కేంద్రం వివిధ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతుంది. తాజాగా బిఎస్‌ఎన్‌ఎల్ తమ ఉద్యోగులకు వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేము అని కేంద్రానికి విన్నపించుకుంది. రూ.2500 కోట్ల నిధుల విలువచేసే టర్మ్ లోన్ కోసం బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని బిజినెస్ స్టాండర్డ్ మీడియా సంస్థ పేర్కొంది. చర్చలు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.అయితే తమకు ద్రవ్యసహాయం చేయకుంటే సిబ్బందికి జీతాల చెల్లింపు కష్టమేనని టెలికాం సంస్థ పేర్కొంది. సిబ్బంది జీతాలకై దాదాపు 850 కోట్లు అవసరమవుతాయి. ఇప్పటికే బిఎస్‌ఎన్‌ఎల్‌కు దాదాపు రూ.13 వేల అప్పులు ఉన్న నేపథ్యంలో సిబ్బందికి వేతనాలకు నిధులు అసాధ్యమని, వచ్చే ఆదాయానికి, ఖర్చులకు మధ్య అంతరం చాలా ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకుంటే ఇక సంస్థను నడపడం కష్టమేనని సంస్థ బడ్జెట్, బ్యాంకింగ్ డివిజన్ సీనియర్ మేనేజర్ పూరన్‌చంద్ర అన్నారు. ప్రభుత్వం తీసుకోబోయే సంస్కరణ చర్యలపైనే బిఎస్‌ఎన్‌ఎల్ భవితవ్యం ఆధారపడి ఉందని ఆయన అన్నారు.ఇప్పటికే ఈ ప్రభుత్వ రంగ సంస్థ 90 వేల కోట్ల నిర్వహణా నష్టంతో కొనసాగుతుంది. నిర్వహణా లోపం, ఉద్యోగులకు ఇచ్చే అధిక వేతనాలు, అనవసర విషయాలలో ప్రభుత్వజోక్యం, టెలికాం రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ప్రణాళికలు లేకపోవటం వెరసి సంస్థ మనుగడ ప్రశ్నార్థంగా మారింది. దేశంలో బిఎస్‌ఎన్‌ఎల్‌కు ఫోన్ వినియోగదారుల వాటా 10 శాతం మాత్రమే ఉంది. మిగతా వారంతా ప్రైవేటు టెలికాం వినియోగదారులే. 2018లో ఆదాయంలో ఎక్కువ శాతం ఉద్యోగుల జీతాలు, ప్రయోజనాలకు ఖర్చు చేసిందని తెలుస్తోంది. టెలికామ్ రంగంలోకి 5జి స్పెక్ట్రమ్ వస్తున్న తరుణంలో బిఎస్‌ఎన్‌ఎల్‌లో సమస్యలు ఇలాగే కొనసాగితే నష్టమేనని నిపుణులు భావిస్తున్నారు.