అదృష్టం అంటే ఇది .. కానిస్టేబుల్‌కు రెండు కోట్ల లాటరీ

SMTV Desk 2019-06-24 13:38:16  

చాలీచాలని జీతంతో బతుకు నెట్టుకొస్తున్న ఓ కానిస్టేబుల్‌కు రెండు కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆ కానిస్టేబుల్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌ సమీపంలోని మోటియాన్‌ గ్రామానికి చెందిన అశోక్‌ కుమార్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఓ రోజు తాను విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ స్టేషన్‌కి ప్రభుత్వ లాటరీ కొనాలంటూ ఓ వ్యక్తి వచ్చాడు.

అదృష్టానికి ఓ అవకాశం ఇచ్చి చూద్దామని భావించిన అశోక్ రూ.200 పెట్టి లాటరీ కొనుగోలు చేశారు. తరువాత దాన్ని నిర్లక్ష్యంగా పోలీస్ స్టేషన్‌లోనే ఏ మూలనో పడేశాడు. ఓ రోజు తనకు పంజాబ్‌ ప్రభుత్వ లోహ్‌రీ బంపర్‌-2019 లాటరీ తగిలిందని, దాంట్లో మీరు రూ.రెండు కోట్లు గెలుచుకున్నారని సమాచారం అందింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను నిర్లక్ష్యంగా పడేసిన టికెట్‌ వెతికి తీసుకొన్నారు. తన లాటరీ నెంబర్‌ను సరిపోల్చుకున్నారు. విజేత తనేనని ఎగిరి గంతేశారు. తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయిన అశోక్‌.. ఇక తన కష్టాలన్నీ తీరిపోనున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై పంజాబ్‌ లాటరీస్‌ డిపార్ట్‌మెంట్‌ స్పందిస్తూ.. అశోక్‌కు వీలైనంత త్వరగా డబ్బు చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.