ప్రజావేదికను కూల్చివేస్తాం.. సీఎం జగన్ సంచలన ప్రకటన

SMTV Desk 2019-06-24 13:31:58  

ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తోన్న కలెక్టర్ల సదస్సు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సదస్సులో ముందుగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ స్వాగతోపన్యాసం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సమావేశం ఉద్దేశాల్ని వివరించారు. అనంతరం రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగించారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ కూడా కలెక్టర్ లను ఉద్దేశించి మాట్లాడారు. అవినీతి, దోపిడీని తమ ప్రభుత్వం ఎంత మాత్రం సహించదని, ఎమ్మెల్యేలు, అధికారులు తమకు రెండు కళ్లు అని తెలిపారు.

నిబంధనలకు విరుద్దంగా ప్రజావేదిక నిర్మించారని, అవినీతి, అక్రమ సంపాదనతో ఈ నిర్మాణం జరిగిందని అన్నారు. అక్రమంగా నిర్మించిన వేదికలో సమావేశం పెట్టే దుస్థితి ఏర్పడిందని అన్నారు. అవినీతి ఏ విధంగా జరిగిందో చూపాలనే ఉద్దేశంతో ఇందులోనే కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని, ఎల్లుండి నుంచి దీనిని కూల్చేస్తామని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కిందిస్థాయి అధికారులు అక్రమాలు చేయకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధ అనిపించదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావేదిక నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను ప్రారంభిద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని, ప్రజావేదికలో ఇదే చివరి సమావేశమని సీఎం వెల్లడించారు.