రెట్టింపైన గుండె ధైర్యం

SMTV Desk 2017-06-03 17:28:43  

చెన్నై, జూన్ 3 : ఏదైనా సాహసకృత్యం చేయాలంటే గుండెధైర్యం కావాలంటారు..మరికొందరు ఎన్నిగుండెలు అంటు నిలదీస్తారు. మరి మనిషికి ఉండేది ఒకే గుండె..రెండు గుండెలు ఉంటే.. సరిగ్గా అలాంటిదే కేరళాలో చోటు చేసుకుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తిని చికిత్స నిమిత్తం కోయంబత్తురులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు గుండె పనితీరు మరీ దారుణంగా ఉన్నట్లు గుర్తించి ప్రాణాలు నిలబడాలంటే మరో గుండెను అమర్చాలని నిర్ణయించారు. అయితే అదే అస్పత్రిలో బ్రెయిన్ డెడ్ కు గురైన మహిళ గుండెను అమర్చాలని నిర్ణయించారు. కాని ఆమె గుండె పనితీరు కూడా అంత సంతృప్తికరంగా లేదని, పదిశాతం మాత్రమే పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే కేరళాకు చెందిన వ్యక్తి శరీరం నుండి గుండెను తొలగించకుండా మహిళ నుంచి సేకరించిన గుండెను కుడివైపున అమర్చాలని వైద్యులు నిర్ణయించి అందుకు అనుగుణంగా శస్ర్తచికిత్స నిర్వహించారు. డాక్టర్ ప్రశాంత్ నేతృత్వంలోని వైద్యుల బృందం సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం అతని శరీరంలోని రెండు గుండెలు సహజరీతిన పనిచేస్తున్నాయని వైద్యులు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేశంలో రెండు గుండెలు కలిగిన తొలి వ్యక్తి ఈయనే అని వైద్యులు వివరించారు. రోగి వివరాలను గోప్యంగా ఉంచారు.