చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

SMTV Desk 2019-06-08 15:58:25  fish medice,

చేప ప్రసాదం పంపిణీకి అంతా రెడీ అయ్యింది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు బత్తిని మృగశిర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై.. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. కొరమీను చేపపిల్లలను మత్స్యశాఖ.. అందుబాటులో ఉంచుతుండగా, బత్తిన సోదరులు చేప ప్రసాదాన్ని ఉచితంగా అందించనున్నారు.

మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.6 లక్షల కొర్రమీన్లను అందుబాటులో ఉంచారు. చేప ప్రసాద పంపిణీకి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 36 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి జనం చేప మందు తీసుకొనేందుకు ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చి ఎగ్జిబిషన్ మైదానం సహా పలు ప్రాంతాల్లో సేదతీరుతున్నారు.

కంట్రోల్ రూం ఏర్పాటుతోపాటు 60 సీసీ కెమెరాలను బిగించారు. రద్దీని తెలుసుకొనేందుకు 3 -4 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. మైదానంలో ఆరు వైద్య బృందాలు, మూడు అగ్నిమాపక శకటాలు, మరో మూడు బుల్లెట్ శకటాలు, ఫైర్ కంట్రోల్ రూంలను అందుబాటులో ఉంచారు. బత్తిని మృగశిర ట్రస్ట్ ద్వారా అందరికీ ఉచితంగా ప్రసాదాన్ని అందించాలన్నదే తమ ఆకాంక్షని బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చొరువ తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదాన్ని స్వీకరించలేనివారి కోసం.. మరుసటిరోజు హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో ఉచితంగా ప్రసాదాన్ని అందజేయనున్నరు.