త్వరలో ‘రైతు భరోసా’ పథకం ప్రారంభించనున్న జగన్ ..

SMTV Desk 2019-06-07 16:58:00  rythu Bharosa, Jagan, KCR,

పాలన, అభివృద్ధి, సంక్షేమ పధకాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పడానికి తాజా ఉదాహరణగా, సిఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు పధకాన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ‘రైతు భరోసా’ పధకాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ఈ పధకాన్ని అమలుచేస్తామని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ ఆంధ్రప్రదేశ్‌లో జరిపిన ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా, రైతులను ఆదుకొంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చబోతున్నారు.ఈ పధకానికి సంబందించి విధివిధానాలు,మార్గదర్శకాలు ఇంకా ప్రకటించవలసి ఉంది. వ్యవసాయ మార్కెట్ ధరల స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామని జగన్‌ చెప్పారు.

ఒక్క రైతుబంధు మాత్రమే కాక, పింఛన్లు, జీతాలు పెంపు, జిల్లాల పునర్విభజన, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనీయడం, విద్యావైద్య రంగాలలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టడం వంటివన్నీ సిఎం కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకొని చేస్తునవేనని చెప్పవచ్చు.

ఏపీలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలను లోతుగా అధ్యయనం చేసిన జగన్‌ వాటిని ఆదర్శంగా తన పార్టీ మేనిఫెస్టో రూపొందించుకొని ఉండవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్ధికపరిస్థితి అంతా గొప్పగా లేకపోయినప్పటికీ సిఎం కేసీఆర్‌ కంటే కాస్త ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి కాస్త ఎక్కువగానే...చాలా ఉదారంగానే...పింఛనులు, జీతాలు పెంచుతుండటం ఆశ్చర్యకరమైన విషయమే.