నడుమునొప్పి కి ఒక చక్కటి చిట్కా

SMTV Desk 2019-06-06 15:45:54  nadumu noppi

ఒక్కోసారి నిల్చున్నా, కూర్చున్నా నడుమునొప్పి… వయసుతో సంబంధం లేకుండా చాలామందిని ఇబ్బంది పెడుతోన్న సమస్య. దీనికి అనారోగ్యాలు, ఆహారపరంగా కాకుండా ఇతర కారణాలున్నాయి. వాటిని మార్చుకోగలిగితే నడుమునొప్పి నుంచి ఉపశమనం లభించినట్లే…

1. రోజూ మీరు పడుకునే విధానం, ఎంచుకునే పరుపు కూడా నడుమునొప్పికి కారణం కావొచ్చు. మెత్తగా, ఎగుడుదిగుడుగా ఉండే పరుపు కాకుండా సమాంతరంగా ఉండేదాన్ని ఎంచుకుంటే మేలు. అలానే కనీసం ఏడెనిమిది గంటల నిద్ర ఉన్నప్పుడు వెన్నుపూసకు విశ్రాంతి లభిస్తుంది. నొప్పి సమస్య పెద్దగా ఉండదు.
2. ఇల్లు, ఆఫీసు… ఎక్కడయినా సరే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, సరిగా కూర్చోకపోవడం, నిలబడకపోవడం వల్ల కూడా నడుము నొప్పి బాధించొచ్చు అని చెబుతున్నారు వైద్యులు. ముందు నిటారుగా నిల్చోవడం, కూర్చోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఎంత తీరిక లేకున్నా ప్రతి అరగంటకోసారైనా లేచి అటూ ఇటూ నడవడం మేలు. ఇవన్నీ నడుమునొప్పిని అదుపులో ఉంచుతాయి.
3. మీ శరీర బరువు వెన్నుపూస మీద పడుతుంది. అది కూడా నడుము నొప్పికి కారణం కావొచ్చు. అందుకే బరువు పెరిగితే కచ్చితంగా దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలంటారు నిపుణులు.
4. హ్యాండ్‌బ్యాగు, బ్యాక్‌ప్యాక్… ఏదైనా సరే ఎక్కువ బరువు ఉన్నదాన్ని తరచూ మోయడం వల్ల కూడా నడుమునొప్పికి కారణం కావచ్చు. ఎక్కడయినా సరే… ఎక్కువసేపు నిల్చోవడం కూడా మంచిదికాదు.