చంద్రబాబు మీద భారీ సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి

SMTV Desk 2019-06-06 14:32:17  vijay sai, Chandrababu,

ఉండవల్లిలోని ప్రజా వేదికను ప్రతి పక్ష నేత హోదాలో తన కార్యకలాపాల కోసం కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తరవాత ఆయనకి చంద్రబాబు రాసిన మొదటి లేఖ ఇది. ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటోన్న ఇంటికి పక్కనే ఈ ప్రజా వేదిక ఉండటంతో దాన్ని తనకు కేటాయించాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు లేఖ రాసిన కొద్ది గంటలకే ప్రజా వేదికను తమకు కేటాయించాలంటూ వైసీపీ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కోరింది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజావేదిక అనువుగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబు లేఖ మీద వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. ట్విట్టర్ ద్వారా చంద్రబాబు మీద సెటైర్లు వేశారు. సీఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం.

40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా, పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా? అని ట్వీట్‌ లో పేర్కొన్నారు. వాస్తవానికి, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసముంటోన్న ఇల్లు పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ గెస్ట్ హౌస్. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో తన గెస్ట్ హౌస్‌ను అప్పటి టీడీపీ ప్రభుత్వానికి రమేష్ అద్దెకు ఇచ్చారు. ఈ గెస్ట్ హౌస్‌ను తన అధికారిక నివాసంగా చంద్రబాబు వాడుకున్నారు. ఈ నివాసానికి ప్రభుత్వమే అద్దె చెల్లించేది. పక్కనే ప్రజా వేదికను ప్రభుత్వ ఖర్చుతో నిర్మించారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత గెస్ట్ హౌస్ కి చంద్రబాబే అద్దె చెల్లిస్తున్నారు. ఇదే ఇంట్లో కొనసాగాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. దీంతో ఈ ఇంటికి పక్కనే ఉన్న ప్రజా వేదికను తనకు కేటాయించాలని కోరారు.