ఉత్తమ్ రాజీనామా .. కాంగ్రెస్ ఎల్పీ విలీనం దిశగా

SMTV Desk 2019-06-06 14:30:32  congress,

తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యత చూపడంతో కాంగ్రెస్ ఎల్పీ విలీనం మరోసారి తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ శాసనసభాపక్షంలోకి కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం కోసం మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ మేరకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికయి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని వదులుకోకూడదని టీఆర్ఎస్ భావిస్తోందని తాజా సమాచారం. ఉత్తమ్ రాజీనామా ముందు వరకు కాంగ్రెస్ శాసనసభాపక్షం బలం 19 మంది. విలీనానికి మూడింట రెండొంతులు అంటే 13 మంది సభ్యులు అవసరం. తాజాగా ఉత్తమ్ రాజీనామాతో విలీనానికి అవసరమైన సభ్యుల సంఖ్య 12 అయింది.

ఇప్పటికే 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ పక్షాన నిలబడేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో టీఆర్ఎస్‌కు ఇంకా ఒక సభ్యుని అవసరం ఉంది. ఓకవేళ టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనం జరిగితే కాంగ్రెస్ సభ్యుల సంఖ్య ఆరుకు పడిపోతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. అయితే జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్‌లో విలీనం కావడం సాంకేతికంగా సాధ్యం కాదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం సీఎల్పీ నేతను అధిష్ఠానమే నిర్ణయిస్తుందని, ప్రత్యేకంగా శాసనసభాపక్షం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదని అంటున్నారు.