సౌదీకి అణు విద్యుత్‌ సమాచారం అందించనున్న అమెరిక!

SMTV Desk 2019-06-06 14:27:50  saudi arabia, america

వాషింగ్టన్‌: సౌదీఅరేబియాకు అణు విద్యుత్‌ సమాచారాన్ని అందించేందుకు రెండు కంపెనీలకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇరాన్‌ అణు కార్యక్రమంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ట్రంప్ సౌదీ అరేబియాకు అణు విద్యుత్‌ పేరుతో ఈ సమాచారాన్ని చేరవేస్తుండడం గమనార్హం. ఖషోగీ హత్య తరువాత కూడా సౌదీ సర్కారుకు ట్రంప్‌ సన్నిహితంగా మెలగడంపై అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సౌదీ తన అణు విద్యుత్‌ రియాక్టర్లను అభివృద్ధి చేసుకునేందుకు పెద్దయెత్తున సహాయాన్ని అందించే విషయంపై ఇరుదేశాల మధ్య 2017 నుండి జరుగుతున్న చర్చలు ఈ అనుమతులతో ఒక కొలిక్కి వచ్చినట్లయింది. వ్యాపార ప్రయోజనాల భద్రత రీత్యా ఈ సమాచారాన్ని అత్యంత గోప్యంగా వుంచాలని అమెరికా విద్యుత్‌ శాఖ సౌదీ అరేబియా ప్రభుత్వానికి సూచించింది. అయితే ఈ అనుమతులిచ్చిన కంపెనీల పేర్లను అమెరికా విద్యుత్‌ శాఖ వెల్లడించేందుకు నిరాకరించింది.