అత్యంత లక్కీ బ్యాట్స్‌మెన్‌‌గా రోహిత్ శర్మ!

SMTV Desk 2019-06-06 14:23:55  rohit sharma

ప్రపంచకప్ 2019 మెగా టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన టీంఇండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఆడిన తొలి మ్యాచ్ లోనే శతకం బాది భారత్‌ని ఒంటిచేత్తో గెలిపించాడు. రోహిత్ శర్మ (122 నాటౌట్: 144 బంతుల్లో 13x4, 2x6) సెంచరీ సాధించడంతో 228 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వాస్తవానికి ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే రోహిత్ శర్మ ఔటవ్వాల్సింది. ఆ తర్వాత కూడా మిడిల్ ఓవర్లలో రెండు సార్లు, స్లాగ్ ఓవర్లలో ఒకసారి అతనికి లైఫ్స్ లభించాయి. ఈ మ్యాచ్‌లోనే అత్యంత లక్కీ బ్యాట్స్‌మెన్‌‌గా రోహిత్ శర్మ నిలిచాడు అని చెప్పుకోవచ్చు. క్రికెట్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఫీల్డర్లలో ఒకడిగా ఉన్న డేవిడ్ మిల్లర్.. అరంగేట్రం ఆటగాడి తరహాలో చేతులో పడిన రోహిత్ శర్మ క్యాచ్‌ని జారవిడిచేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబాడ బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా నెట్టేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ.. షార్ట్ పిచ్‌ రూపంలో వచ్చిన బంతి అతని బ్యాట్, గ్లౌవ్స్‌ని తాకి స్లిప్‌లో గాల్లోకి లేచింది. కానీ.. స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ డుప్లెసిస్ బంతిని అంచనా వేయలేక నేలపాలు చేశాడు. ఆ తర్వాత ఫెలుక్వాయో బౌలింగ్‌లో బౌన్సర్‌ని హుక్ చేయబోయి షార్ట్ ఫైన్‌లెగ్‌లో రోహిత్ శర్మ బంతిని గాల్లోకి లేపేశాడు. కానీ.. ఫీల్డర్‌కి కొద్ది దూరంలో అది పడిపోయింది. మళ్లీ రబాడ బౌలింగ్‌లో ఎడ్జ్ తీసుకున్న బంతి పాయింట్‌లో గాల్లోకి లేచింది. ఇక్కడా ఫీల్డర్‌ వెనక్కి వేగంగా వెళ్లలేక క్యాచ్‌ని జారవిడిచాడు. ఆఖరిగా శతకం సాధించిన తర్వాత రోహిత్ శర్మ 107 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మళ్లీ రబాడ బౌలింగ్‌లోనే బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా బంతిని గాల్లోకి లేపేశాడు. ఈసారి నేరుగా ఫీల్డర్ డేవిడ్ మిల్లర్ చేతుల్లోకి బంతి వెళ్లింది. కానీ.. క్యాచ్‌ని మిల్లర్ ఒడిసిపట్టుకోలేకపోయాడు. దీంతో.. బౌలర్ రబాడతో పాటు దక్షిణాఫ్రికా టీమ్ మొత్తం ఆశ్చర్యపోయింది.