నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం... రైతులు నిరీక్షణ

SMTV Desk 2019-06-06 13:05:46  Monsoon,

రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుందని, ఎండ వేడిమి మరికొన్ని రోజులు కొనసాగుతుందని తాజా సమాచారం. నైరుతి రుతుపవనాలు మందగమనంతో సాగుతున్న కారణంగా, జూన్‌ 7కు రెండు రోజులు అటూఇటుగా కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని గతంలో వచ్చిన వార్తను కూడా ఇది మరోమారు అబద్దం చేసింది. నిజానికి జూన్ 4 నాటికి నైరుతి భారత్ కు వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇప్పుడు మరో రెండు రోజులు ఆలస్యంగా వస్తున్నట్లు సమాచారం. ఇక 13న దక్షిణ తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఒక రెండు రోజులు అటూ ఇటూగా కూడా ఉండొచ్చని ఆయన తెలిపారు. అంతేకాక దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోకి ఈనెల 11న ప్రవేశించే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క రుతుపవనాలు రాక, ఇంకా వానలు పడకపోవడంతో ఖరీఫ్‌ నాట్లు ఆలస్యమవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రుతు పవనాలు కిందటేడాది కూడా ఆలస్యంగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 2018లో జూన్‌ 8న, 2017లో జూన్‌ 12న తెలంగాణలోకి ప్రవేశించాయి. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కోసం చూస్తోన్న ప్రజలకు, తొలకరి చినుకుల కోసం ఎదురుచూస్తోన్న రైతులకి మరోసారి నిరాశ తప్పలేదు.