అందుకే చంద్రబాబు దారుణనంగా ఓడిపోయారు

SMTV Desk 2019-06-06 13:04:42  Motkupalli, chandrababu,

చంద్రబాబు ఓటమి తనకెంతో ఆనందం ఇస్తోందని తెలుగుదేశం పార్టీ మాజీ నేత మోత్కుపల్లి నర్సిహులు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలవ్వడంపై టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో స్వీట్లు పంచుతూ ఎంజాయ్ చేసిన మోత్కుపల్లి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కు చెల్లించుకున్నారు. ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మోత్కుపల్లి నర్సింహులు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఓడిపోవాలని మెుక్కుకున్నట్లు ప్రకటించారు. మోత్కుపల్లి కోరుకున్నట్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు.

మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్లి స్వామి వారి మెుక్కులు తీర్చుకున్నారు మోత్కుపల్లి. ఇక బాబు ఓడిపోవడమే ఎన్టీఆర్ కోరుకున్నారని అందుకే చంద్రబాబు ఈ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరాజయంతో దివంగత సీఎం ఎన్టీఆర్‌ ఘోష నెరవేరిందని స్పష్టం చేశారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. నమ్మినవారిని నట్టేట ముంచే చంద్రబాబు, రాజ్యసభ సీట్లను రూ. 100 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఒక ఎస్సీకిగానీ, బీసీకిగానీ ఒక్క పదవి కూడా ఇవ్వలేదని అన్నారు. చంద్రబాబును తెలంగాణ నుంచి ప్రజలు ఎన్నడో తరిమేశారని, ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగిందని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదని మండిపడ్డారు.