సిఎం కేసీఆర్‌ హత్యారాజకీయాలకు తెర తీశారు: బండి సంజయ్

SMTV Desk 2019-06-06 12:37:38  Bandi Sanjay, KCr,

సిఎం కేసీఆర్‌పై బిజెపి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. “రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను అడ్డుకోవడానికి సిఎం కేసీఆర్‌ హత్యారాజకీయాలకు తెర తీశారు. నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో తెరాస కార్యకర్తలు మూకుమ్మడిగా బిజెపి కార్యకర్త ప్రేమ్ కుమార్‌పై దాడి చేసి హత్య చేశారు. ప్రేమ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు బిజెపి కార్యకర్తలను కూడా హత్య చేసేందుకు తెరాస ప్రయత్నించింది కానీ మిగిలినవారు తప్పించుకోగలిగారు. తెరాస అగ్రనేతల ప్రోద్బలంతోనే ప్రేమ్ కుమార్‌ హత్య జరిగిందని భావిస్తున్నాను. రాష్ట్రంలో ప్రతిపక్షాల ఎదుగుదలను అడ్డుకొనేందుకు సిఎం కేసీఆర్‌ హత్యా రాజకీయాలు చేస్తే, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు పట్టిన గతే కేసీఆర్‌కు కూడా పడుతుందని హెచ్చరిస్తున్నాను. ప్రేమ్ కుమార్‌ హత్యపై తక్షణమే విచారణకు ఆదేశించి హంతకులకు కటిన శిక్షపడేలా చేయాలని తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తెరాసను డ్డీకొనేందుకు ఇకపై బిజెపి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని బండి సంజయ్ కుమార్ అన్నారు.

రాష్ట్రంలో బిజెపి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఇటువంటి ఘటనలు సహజంగానే తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉంది. కనుక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తెరాస అధిష్టానం జాగ్రత్తలు తీసుకొంటే మంచిది.