వాణిజ్య వివాదాలపై స్పందించనున్న ఫెడరల్‌ రిజర్వ్‌

SMTV Desk 2019-06-06 12:13:55  federal reserve chairman jerome powell

వాషింగ్టన్‌: ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ వాణిజ్య వివాదాలను ఎదుర్కొనేందుకు తగిన విధంగా స్పందించనున్నట్లు తాజాగా వెల్లడించారు. దీనివల్ల ఇప్పటివరకూ వడ్డీరేట్ల పెంపు బాటలో సాగుతున్న కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఇకపై రేట్ల కోతవైపు దృష్టిసారించనున్నట్లు అంచనాలున్నాయి. దీనికితోడు ఫెడ్‌ ప్రెసిడెంట్‌ జేమ్స్‌ బుల్లార్డ్‌ కూడా త్వరలో రేట్ల తగ్గింపునకు అవకాశం ఉన్నట్లు తెలియడంతో ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లయింది. ఒక్కసారిగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. డోజోన్స్‌ 512పాయింట్లు పెరిగి 25,332కు చేరగా, ఎస్‌అండ్‌పి 59 పాయింట్లు పెరిగి 2,803వద్ద నిలిచింది.నాస్‌డాక్‌ మరింత అధికంగా 194 పాయింట్లు పెరిగి 7,527వద్ద నిలిచింది. వెరసి ఒకేరోజులో గత ఐదు నెలల్లోలేని విధంగా అత్యధిక లాభాలు సాధించాయి. సోమవారం వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించనున్న ఆందోళనలతో నీరసిస్తూ వచ్చిన బాండ్ల ఈల్డ్స్‌ ఒక్కసారిగా పెరిగాయి. సోమవారం 20 నెలల కనిష్టం 2.06శాతాన్ని తాకిన ట్రెజరీ ఈల్డ్స్‌ 4.5బేసిస్‌ పాయింట్లు పెరిగి 2.126కు చేరాయి. దీంతో వడ్డీరేట్ల ప్రభావిత ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ పెరిగింది.