విజయం పై కన్నేసిన భారత్

SMTV Desk 2019-06-05 16:33:03  team india, icc world cup 2019, india vs south africa

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున ప్రపంచకప్‌లో టీంఇండియా తొలి మ్యాచ్ నేడు ఇంగ్లాండ్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టోర్నీలో సఫారీలకు ఇప్పటికే రెండు పరాజయాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన సౌతాఫ్రికా తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతింది. సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే సఫారీలు ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇక, భారత్ కూడా విజయంతో ప్రపంచకప్ జైత్రయాత్రకు శ్రీకారం చుట్టాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. కొంతకాలంగా సౌతాఫ్రికా ఆశించిన స్థాయిలో ఆటను కనబరచలేక పోతోంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లు జట్టులో ఉన్నా పరాజయాలు తప్పడం లేదు. అయితే భారత్‌తో జరిగే మ్యాచ్ ద్వారా దీనికి పుల్‌స్టాప్ పెట్టాలని తహతహలాడుతోంది. భారత్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రెండు జట్లు కూడా గెలుపే లక్షంగా పెట్టుకోవడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు కీలకంగా మారారు. ఇటీవల జరిగిన వార్మప్ మ్యాచుల్లో రోహిత్, ధావన్‌లు విఫలమయ్యారు. అయితే కీలకమైన వరల్డ్‌కప్‌లో ఇద్దరు మెరుపులు మెరిపిస్తారనే నమ్మకంతో కెప్టెన్ కోహ్లి ఉన్నాడు. రోహిత్ చెలరేగితే సౌతాఫ్రికా బౌలర్లకు కష్టాలు తప్పవు. ఎటువంటి బౌలింగ్‌నైనా చిన్నాభిన్నం చేసే సత్తా భారత ఓపెనర్లకు ఉంది. వీరు విజృంభిస్తే జట్టుకు ఎదురే ఉండదు. అయితే ఇటీవల కాలంలో ధావన్ ఫామ్ భారత్‌ను కలవరానికి గురి చేస్తోంది. నిలకడగా ఆడడంలో విఫలమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ మ్యాచ్‌లో ధావన్ తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా రోహిత్ కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. తన సహాజ సిద్ధ ఆటతో జట్టుకు అండగా నిలవాలి.