కాలేజీ విద్యార్థికి నిఫా వైరస్...కేరళలో కలకలం

SMTV Desk 2019-06-05 16:09:56  nipha virus,

కేరళలో 23 ఏళ్ల కాలేజీ విద్యార్థికి నిఫా వైరస్ సోకింది. ఆ విద్యార్థి రక్త నమూనాల్ని పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)లో పరీక్షించి, ఫలితాలు వెలువడిన తర్వాత నిఫా సోకినట్టు ధ్రువీకరించారు. మరో 86 మందిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్టు కేరళ ఆరోగ్యమంత్రి కెకె శైలజ మంగళవారం చెప్పారు. అంతకు ముందు ఆ విద్యార్థి రక్త నమూనాల్ని మణిపాల్, కేరళ వైరాలజీ సంస్థల్లో పరీక్షించినప్పుడు నిఫా లక్షణాలు కనిపించాయి. ఇక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వెంటిలేటర్ వంటి సాధనాలేవీ అమర్చలేదని ఆరోగ్యమంత్రి చెప్పారు. ‘రోగిపట్ల అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం.

జ్వరంవల్ల ఒక్కోసారి అస్థిమితంగా ఉంటున్నాడు. మంచి ఫలితం వస్తుందనే అనుకుంటున్నాం’ అని శైలజ తెలిపారు. అతనితో పాటు ఉన్న మరో 86 మంది జాబితాను తయారుచేసి వారిని వైద్యపర్యవేక్షణలో ఉంచామన్నారు. వారిలో ఇద్దరికి జ్వరం రావడంతో వారిని విడిగా ఒక వార్డుకు మార్చామన్నారు. అయితే, వైరస్ సోకిన విద్యార్థికి సేవలందించిన ఇద్దరు నర్సులకు గొంతు మంట, జ్వరం రావడంతో వారిని కూడా పర్యవేక్షణలో ఉంచారు.