కాంగ్రెస్ పార్టీ కి మళ్ళీ ఎదురుగాలి

SMTV Desk 2019-06-05 15:24:48  Congress,

పరిషత్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు పరేషాన్ తప్పలేదు. ఆ పార్టీకి మళ్ళీ ఎదురుగాలి వీచింది. అన్ని జిల్లాలోనూ అధికార పార్టీ కారు వేగానికి హస్తం పార్టీ తట్టుకోలేక కుదేలైంది. ఫలితంగా జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. దీంతో స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం అచ్చిరాలేదనే తెలుస్తోంది. రెండు రోజుల క్రితం వెల్లడి అయిన స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పరాజయం తప్పలేదు. చివరకు సిట్టింగ్ స్థానమైన నల్గొండ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి గట్టిషాక్ ఇచ్చిన తరుణంలో కనీసం పరిషత్ ఎన్నికల్లో అయినా కాస్తంత గాలి వీస్తుందని ఆ పార్టీ నేతలు భావించారు. కానీ కాంగ్రెస్ రాత మారలేదు. ఆ పార్టీ అభ్యర్ధులకు అదృష్టం కలిసి రాలేదు. దీంతో రాష్ట్రంలోని 32 జిల్లాల్లోని (హైదరాబాద్ మినహా) 538 జెడ్‌పిటిసి, 5,817 ఎంపిటిసి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా స్పష్టమైన ఆధీక్యాన్ని ప్రదర్శించ లేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలను అందించిన పూర్వ ఖమ్మం జిల్లా కూడా ఆ పార్టీని ఆదుకోలేకపోయింది. దీంతో కేవలం 76 జెడ్‌పిటిసి, 1,377 ఎంపిటిసి స్థానాలతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

కాగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన భువనగిరి, నల్గొండ, మల్కాజ్‌గిరి నియోజకవర్గాల పరిధిలోని ఎంపిటిసి, జెడ్‌పిటిసిలోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. దీంతో స్థానిక ఎన్నికలైన పంచాయతీ, స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబోల్తపడగా, పరిషత్ ఎన్నికల్లోనూ అదే ఘటన పునరావృతమైంది. మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికికి భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఈ దుస్థితి నుంచి కాంగ్రెస్ బయటపడుతుందా? లేక మరింత హీన స్థితికి దిగజారుతుందా? అన్నది ప్రస్తుతానికి వేచి చూడాల్సిందే.