శ్రీలంకకు తొలి విజయం ...

SMTV Desk 2019-06-05 14:51:25  Sri lanka, Afghanistan,

కార్డిఫ్ : వర్షం మధ్య గెలుపు ఓటములు దోబూచులాడిన మ్యాచ్‌లో శ్రీలంక ఎట్టకేలకు విజయం సాధించింది. విజయానికి 41 ఓవర్లలో 187 పరుగులు చేయాల్సిన అఫ్గానిస్థాన్ ఓటమి పాలయినప్పటికీ శ్రీలంకకు చుక్కలు చూపించింది. తొలుత శ్రీలంకను కేవలం 36.5 ఓవర్లలోనే 201 పరుగులకు ఆలౌట్ చేసిన అఫ్గాన్ విజయం కోసం చివరి వరకు పోరాడింది. ఒక దశలో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ ఏమాత్రం నీరుగారని ఆ జట్టు కెప్టెన్ గుల్‌బదన్ నయీబ్, నజిబుల్లా జర్దాన్‌లు సమయస్ఫూర్తితో ఆడుతూ ఆరో వికెట్‌కు 64 పరుగులు జోడించడంతో అఫ్గాన్ విజయం ఖాయమని పించింది. అయితే శ్రీలక స్పిన్నర్ నువాన్ ప్రదీప్ అద్భుతంగా బౌల్ చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత నయీబ్‌ను ఔట్ చేసిన ప్రదీప్ ఆ తర్వాత కొద్ది సేపటికే రషీద్ ఖాన్‌ను కూడా పెవిలియన్‌కు పంపించడంతో మ్యాచ్ శ్రీలంక వైపు మొగ్గింది. ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా వికెట్లు పడిపోవడంతో అఫ్గాన్ చివరికి 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో లంక 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ 9 ఓవర్లలో కేవలం 31 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. చివర్లో వరసగా రెండు వికెట్లు పడగొట్టి విజయాన్ని సంపూ ర్ణం చేసిన మలింగకు 3 వికెట్లు దక్కాయి. అఫ్గా న్ బ్యాట్స్‌మెన్‌లో నజిబుల్లా జర్దాన్ 43 పరుగులు, హజరత్ జాజల్ 30 పరుగులు చేశాడు.