ఆయన ఒక్కరే 35 మంది తెరాస ఎమ్మెల్సీలకు సమానం

SMTV Desk 2019-06-04 15:56:55  Jagga Redddy,

ఇటీవల తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్ళీ నిన్న తెరాస ఎమ్మెల్సీలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “మండలిలో 35మంది తెరాస ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ వారెవరూ ధైర్యంగా గొంతెత్తి ప్రజాసమస్యలపై మాట్లాడలేరు. కనుక కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక్కరే మండలిలో ప్రజాసమస్యలపై నిర్భయంగా మాట్లాడగలరు. కనుక ఆయన ఒక్కరే 35 మంది తెరాస ఎమ్మెల్సీలకు సమానమనుకోవచ్చు,” అని అన్నారు.

హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో త్వరలో ఉపఎన్నికలు జరుగనున్నాయి. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మంచి పట్టుంది కనుక ఆ స్థానాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతికి కేటాయిస్తే ఆమె తప్పకుండా గెలుస్తారని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుస ఓటముల కారణంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కాంగ్రెస్‌ నేతలు ఆర్ధికంగా దెబ్బ తిన్నప్పటికీ వారు ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోగలరని అన్నారు. హుజూర్‌నగర్‌ సీటును పద్మావతికి కేటాయిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా డబ్బు సర్దుబాటు చేసుకోగలరని భావిస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస గెలుస్తుందని అందరికీ ముందే తెలుసని కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయం అని జగ్గారెడ్డి అన్నారు.