ఉత్తర కొరియా మిస్సైల్ టెస్ట్‌... అగ్రరాజ్య వెన్నులో వణుకు

SMTV Desk 2017-08-29 12:20:06  USA, North Korea, Missile tests, Nuclear Missiles, USA vs North Korea

అమెరికా, ఆగస్ట్ 29: గత కొద్ది కాలంగా ఉత్తర కొరియా, అమెరికాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పలు మార్లు ఉత్తరకొరియా, అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. కాగా, అంతే ధీటుగా అమెరికా కూడా స్పందించింది. ఉత్తరకొరియా ఏం చేయలేదు కేవలం ప్రగల్భాలు పలుకుతుందంతే అని ప్రకటించిన అమెరికా గుండెల్లో భయాందోళన మొదలైంది. దీనికి కారణం తాజాగా ఉత్తరకొరియా న్యూ క్లియర్ మిస్సైల్ టెస్ట్‌ లు నిర్వహించడమే. ఈ క్రమంలో ఉత్తరకొరియా నిర్వహించిన న్యూ క్లియర్ మిస్సైల్ టెస్ట్ లు కలవరపాటుకు గురి చేశాయని అమెరికా ప్రభుత్వ కార్యదర్శి రేక్స్ టెల్లర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుత ఒత్తిడితోనే ఉత్తరకొరియాతో సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. అయితే ఉత్తరకొరియా మాత్రం ఎప్పటికప్పుడు తమ శాంతియుత ప్రయత్నాలకు తూట్లు పొడుస్తోందని ఆయన మండిపడ్డారు. దీంతో చైనా సాయంతో ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశామని, అయినప్పటికీ ఫలితం లేదని ఆయన చెప్పారు. తాజాగా దక్షిణకొరియాతో కలిసి తమ సైన్యం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్న తరుణంలో ఉత్తరకొరియా రెచ్చగొట్టేలా వ్యవహరించడం మంచిది కాదని ఆయన సూచించారు. అమెరికా శాంతి మార్గాన్ని ఎన్నుకుందని, ఇరు దేశాల మధ్య శాంతి నెలకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు.