వారిద్దరి మధ్య వయసు తేడా 26 ఏళ్లు

SMTV Desk 2019-06-03 16:45:00  milind soman

బాలీవుడ్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్, ఆయన భార్య అంకిత కొన్వర్ మధ్య వయసు తారతమ్యం ఏకంగా 26 ఏళ్లు. అస్సామీ బ్యూటీ అంకితతో ఐదేళ్లుగా డేటింగ్‌లో ఉన్న మిలింద్ గతేడాది ఆమెను పెళ్లాడాడు. అప్పట్లో వీరి వివాహ వార్త సంచలనమైంది. ఇద్దరి మధ్య వయసు తారతమ్యం ఉండడమే అందుకు కారణం.

అంకిత తాజాగా ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాను మలేసియాలో ఎయిర్ ఏషియా విమానయాన సంస్థలో కేబిన్ క్రూగా పనిచేసేదానినని, ఆ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ అకస్మాత్తుగా చనిపోవడం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొంది.

ఆ తర్వాత కొన్ని నెలలకు తనకు చెన్నై ట్రాన్స్‌ఫర్ అయిందని పేర్కొంది. అక్కడ ఓ హోటల్ లాబీలో కొలీగ్స్‌తో కలిసి ఉన్నప్పుడు మిలింద్ సోమన్‌ను తొలిసారి చూసినట్టు చెప్పింది. అప్పటికే తాను అతడికి పెద్ద అభిమానినని, దీంతో ఆయనను కలిసి పలకరించినట్టు చెప్పింది. మరోసారి నైట్‌క్లబ్‌లో చూశానని గుర్తు చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పేర్కొంది.

విషయం తెలిసిన తన కుటుంబ సభ్యులు ఇద్దరి మధ్య వయసు తారతమ్యం చాలా ఎక్కువగా ఉండడంతో చాలా బాధపడ్డారని అయితే, మిలింద్‌తో తాను సంతోషంగా ఉండడం చూసి వారు తమ ప్రేమను అంగీకరించారని అంకిత చెప్పుకొచ్చింది.