బ్రేకింగ్ .. హిందీ తప్పనిసరి కాదు..

SMTV Desk 2019-06-03 16:41:44  Hindi Language

హిందీ భాష తప్పనిసరి అన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనకు దక్షిణాది రాష్ట్రల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనకకు తీసుకుంది. అన్ని స్కూళ్ల‌లో హిందీ భాష‌ను మూడ‌వ భాష‌గా నేర్పాలంటూ మోదీ స‌ర్కార్ తెచ్చిన కొత్త విద్యా నిబంధ‌న‌పై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్తం అయిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాలైన త‌మిళ‌నాడులో భారీ స్థాయిలో వ్య‌తిరేక‌త వ‌చ్చింది. దక్షిణాది రాష్ట్రాల వారు హిందీ నేర్చుకుంటారు కానీ… ఉత్తరాదిన ఉండేవారు తమిళం, మళయాలం నేర్చుకుంటారా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ సూటిగా ప్రశ్నించారు. ఈ అంశం చిలికి చిలికి పెద్ద గాలివానలా మారింది. దీంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెనకకు తగ్గక తప్పలేదు.

నూతన జాతీయ విద్యా విధానం-2019 ముసాయిదాను ప్రభుత్వం సవరించింది. పాత విధానం ప్రకారం 3-8ఏళ్ల వయసు మధ్య పిల్లలు హిందీ సహా మూడు భాషలు నేర్చుకోవాలన్న సూచనను ఎత్తివేశారు. దాని స్థానంలో పిల్లలు తమకు నచ్చిన ఏవైనా మూడు భాషల్ని ఎంచుకునే వెసలుబాటును కల్పించారు. మార్పు చేసిన విద్యా విధాన ముసాయిదాను మ‌ళ్లీ విడుద‌ల చేశారు. ప్ర‌ఖ్యాత శాస్త్ర‌వేత్త కే.క‌స్తూరిరంగ‌న్ ఇచ్చిన నివేదిక ప్ర‌కారం హిందీ భాష‌ను త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని భావించారు.