సఫారీలపై బంగ్లాదేశ్ సంచలన విజయం

SMTV Desk 2019-06-03 15:17:33  South africa, Bangladesh

లండన్: సంచనాలకు మారుపేరయిన బంగ్లాదేశ్ జట్టు ప్రపంచకప్‌లో మరో సంచలనం సృష్టించింది. ఆదివారం ఇక్కడి ఓవల్ మైదానంలో టైటిల్ ఫేవరేట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాపై సంచలన విజయం నమోదు చేసింది. తొలుత బ్యాట్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ఇది బంగ్లాదేశ్‌కు ప్రపంచకప్‌లోనే కాకుండా వన్‌డేలలోనే అత్యధిక స్కోరు కావడం విశేషం. కాగా అనంతరం బంగ్లాదేశ్ తమ ముందుంచిన భారీ లక్షాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా వరసగా వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమ యానికి 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం కాగా, ఇంతకు ముందు టోర్నమెంటు ప్రారంభ మాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలయిన దక్షిణాఫ్రికాకు రెండో ఓటమి. ఆ జట్టు తన తదుపరి మాచ్‌లో ఈ నెల 5న భారత్‌తో తలపడనుంది. దక్షిణాఫ్రికా జట్టులో డుప్లెసిస్ తప్ప మరెవరూ పెద్ద స్కోరు చేయలేకపోయారు. అలాగే భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపో యారు.బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ 3 వికెట్లు పడగొట్టగా, సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టాడు. మెహిదీ హసన్, షకీబ్ అల్ హసన్‌లకు చెరో వికెట్ దక్కింది.