అప్పుడు ఇందిరా...ఇప్పుడు నిర్మలా!

SMTV Desk 2019-06-03 15:01:23  indhira gandhi, nirmala sitharaman, state finance minister

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక శాఖా మంత్రిగా నిర్మలా సీతరామన్ తాజాగా నియమితులైన సంగతి తెలిసిందే. అయితే ఈ భాధ్యతలు గతంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ చేపట్టగా.....48 ఏళ్ల తరువాత మళ్ళీ ఓ మహిళా ఈ భాధ్యతలను చేపట్టడం విశేషం. 1969 నుంచి 1970 వరకు స్వల్ప కాలం ఆర్థికమంత్రిగా ఇందిరా గాంధీ సేవలందించగా, ఆ తర్వాత మళ్లీ పూర్తి స్థాయిలో సీతారామన్ ఈ బాధ్యతలు చేపట్టారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రిగా రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన వేడుకలో 50కి పైగా మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టారు. తొలి మహిళగా కీలక ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టినందుకు గాను సీతారామన్‌కు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ మోహబూబా హర్షం వ్యక్తం చేశారు. సీతారామన్ 2008లో భాజపాలో చేరారు. 2010 నుంచి 2014 వరకు పార్టీ జాతీయ ప్రతినిధిగా పనిచేశారు. కార్యకర్తగా, ప్రతినిధిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ, సీతారామన్ సేవలను గుర్తించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మోడీ తొలి ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా సిఎంగా బాధ్యతలు స్వీకరించడంతో ఆ పదవి ఈమెను వరించింది. 2017లో ఈమె రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సీతారామన్, తాజాగా ఆర్థికమంత్రిగా మరెన్ని సంస్కరణలను తీసుకొస్తారో వేచిచూడాలి.