మొక్కలు నాటితేనే పాస్...!

SMTV Desk 2019-06-03 14:57:15  All Students In Philippines Must Plant 10 Trees To Graduate Under New Law

ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్ ప్రభుత్వం విద్యార్థులకు ఓ కొత్త రూల్ పెట్టింది. అంతరించిపోతున్న చెట్లను దృష్టిలో పెట్టుకొని ఫిలిప్పీన్స్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్షల్లో పాస్ కావాలన్నా, గ్రాడ్యూయేషన్ సర్టిఫికెట్ పొందాలన్నా వారంతా తప్పనిసరిగా ఒక్కొక్కరు పదేసి మొక్కలు నాటాలి. లేకుంటే పరీక్షల్లో పాస్ అయినా (పాస్‌కు సరిపడే మార్కులు వచ్చినాసరే) ఫెయిలైనట్లేనని రూల్ పెట్టింది. హైస్కూల్ నుంచి కాలేజ్ వరకు ప్రతి విద్యార్థి ఒక్కొక్కరూ 10 మొక్కలు నాటాలి. రోజు రోజుకు పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్‌ను నియంత్రించేందుకు.. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబంధించి ‘గ్రాడ్యూయేషన్ లేజసీ ఫర్ ది ఎన్విరాన్మెంట్’ చట్టానికి మే 15న శాసన సభ్యులు ఆమోదం కూడా తెలిపారు. ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు.. విద్యార్ధులు పదేసి మొక్కలు నాటితేనే పాసైనట్లుగా తాము గుర్తిస్తామని అధికారులు ప్రకటించారు.ఈ సందర్భంగా మాగ్దా పార్టీ ప్రతినిధి గ్యారే అలెజనో మాట్లాడుతూ.. ‘మేము ఈ నిబంధన పెట్టిన అనంతరం ఎలిమెంట్రీ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ప్రతీ ఏటా 12 మిలియన్ల మంది విద్యార్థులు పాస్ అవుతున్నారు. ప్రతీ విద్యార్థి పదేసి చొప్పున మొక్కలను నాటితే ఏడాది 175 మిలియన్ మొక్కలతో దేశవ్యాప్తంగా పచ్చదనం నిండిపోతుంది’ అని వ్యాఖ్యానించారు.