నూతన విద్యా విధానం ....భారతీయ విలువల భోదన

SMTV Desk 2019-06-02 13:19:12  new education system

విద్యా విధానంలో సమూల మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10+2 విద్యా విధానానికి చెల్లు చీటీ రాసి, 5+3+3+4 పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న 1968 నాటి జాతీయ విద్యా విధానం రద్దవుతుంది. నూతన విధానంలో విద్యతోపాటు భారతీయ విలువలను కూడా బోధిస్తారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ ముసాయిదా నూతన జాతీయ విద్యా విధానం, 2019ని రూపొందించింది. 10+2 విద్యా విధానాన్ని తొలగించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 10+2 విధానంలో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు వేర్వేరు చోట్ల వేర్వేరు పేర్లతో బోధిస్తున్నారు.

కొన్ని చోట్ల తరగతులు అని, మరికొన్ని చోట్ల గ్రేడ్లు అని అంటున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక దశగా, ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రాథమికోన్నత దశగా, 9-10 తరగతులను సెకండరీ స్టేజ్ అని, 11-12 తరగతులను హయ్యర్ సెకండరీ, ప్రీ యూనివర్సిటీ, ఇంటర్మీడియేట్ లేదా జూనియర్ కాలేజి దశ అని అంటున్నారు.

తాజా సిఫారసుల ప్రకారం హయ్యర్ సెకండరీ, జూనియర్ కాలేజీ అనేవి రద్దవుతాయి. 11వ తరగతి, 12వ తరగతి కూడా సెకండరీ స్టేజ్‌లో భాగమవుతాయి. పాఠ్యాంశాల్లో భారతీయ, స్థానిక సంప్రదాయాలను చేర్చుతారు. అదేవిధంగా నైతిక భావాలు, సాంఘిక, భావోద్వేగపరమైన అంశాలు, తార్కిక పరిశీలన, కంప్యుటేషనల్ థింకింగ్, డిజిటల్ లిటరసీ, సైంటిఫిక్ టెంపర్, భాషలు, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతారు. అభివృద్ధిపరంగా తగిన రీతిలో బోధన జరుగుతుంది. ప్రతి దశలోనూ అత్యుత్తమ స్థాయిలో విద్యార్థినీ, విద్యార్థులను తీర్చిదిద్దడానికి కృషి జరుగుతుంది.

మాడ్యులార్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ విధానాన్ని ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ప్రతి సబ్జెక్ట్‌లోనూ కేవలం మౌలిక భావనలు,సిద్ధాంతాలు, విమర్శనాత్మకంగా ఆలోచించడం, ఇతర అత్యున్నత నైపుణ్యాలను నేర్పించాలని పేర్కొంది. విద్యార్థులు ఎదిగే దశలో 3-8 సంవత్సరాలు, 8-11 సంవత్సరాలు, 11-14 సంవత్సరాలు, 14-18 సంవత్సరాల వయసులో వారి ఆసక్తులు, అభివృద్ధి అవసరాలకు తగిన పాఠ్య ప్రణాళిక, విద్యా బోధన జరిగే విధంగా పాఠశాల విద్యా విధానం పాఠ్య ప్రణాళిక, బోధన పద్ధతులను రూపొందిస్తామని తెలిపింది.

పాఠశాల విద్య నిర్మాణం, నిబంధనావళి 5+3+3+4 విధానంలో ఉంటాయని పేర్కొంది. దీనిలో ఐదేళ్ళపాటు ప్రాథమిక దశ విద్యా బోధన ఉంటుంది. దీనిలో మూడేళ్ళపాటు ప్రీప్రైమరీ స్కూల్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటాయి. ఆ తర్వాత మూడేళ్ళపాటు ప్రిపరేటరీ స్టేజ్ ఉంటుంది. దీనిలో 3, 4, 5 గ్రేడ్లు ఉంటాయి. ఆ తర్వాత మూడేళ్ళపాటు మిడిల్ స్టేజ్ లేదా అప్పర్ ప్రైమరీ స్టేజ్ ఉంటుంది. దీనిలో 6, 7, 8 గ్రేడ్లు ఉంటాయి.చివరి నాలుగేళ్ళలో 9, 10, 11, 12 గ్రేడ్లు ఉంటాయి, దీనిని హై స్టేజ్ అని లేదా సెకండరీ స్టేజ్ అని పిలుస్తారు.

కమిటీ చైర్మన్ కస్తూరిరంగన్ మాట్లాడుతూ 10+2 విద్యా విధానం వల్ల మన దేశానికి మేలు జరిగిందన్నారు. 50 ఏళ్ళపాటు ఇదే అమల్లో ఉందన్నారు. భారత దేశంలో పాఠశాల విద్య వ్యవస్థను ఏకీకృతం చేయడంలో ఇదొక ముఖ్యమైన అంశమని తెలిపారు.

అయితే ఆధునిక కాలం, ఉపాధి, తదితర అంశాలకు సంబంధించిన అవసరాలు, కాగ్నిటివ్ సైన్స్‌ అభివృద్ధి, కొత్తవాటిని కనుగొనడం వంటివాటివల్ల నూతన విద్యా వ్యవస్థ అవసరం ఏర్పడిందని తెలిపారు. జాతీయ విద్యా విధానం, 2019 కమిటీ చీఫ్ కస్తూరిరంగన్ నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ రమేశ్ పోఖ్రియాల్, సహాయ మంత్రి సంజయ్ షామ్‌రావ్ ధోత్రోలకు శుక్రవారం సమర్పించారు.