సామాజిక మాధ్యమాల్లో దుబాయ్ బాయ్ సెన్సెషన్‌

SMTV Desk 2019-06-02 11:53:12  dubai

ఎనిమిదేళ్ల బాలుడు రాత్రికి రాత్రే దుబాయిలో సెన్సెషన్‌గా మారాడు. అయితే అతనేదో కార్యక్రమంలో పాల్గొని మంచి ప్రదర్శన చేసి కానీ, సోషల్ మీడియాలో సమ్‌థింగ్ స్పెషల్‌గా ఎదో చేసి ఇలా సెన్సెషన్ సృష్టించి ఉంటాడనుకుంటే పొరబడినట్టే. అలాంటివేమి అతడు చేయలేదు. కేవలం చారిటీతో ఇలా యూఏఈ సెన్సెషన్ బాయ్‌గా అవతరించాడు.

ఇక్కడ బాలుడిది ఓ ప్రత్యేకత ఉంది. బాలుడు దానం చేసింది ధన, ధాన్యాలు కాదు... అతడి తల వెంట్రుకలు. అది కూడా క్యాన్సర్ బాధితులకు. యూఈఏకి చెందిన ఎనిమిదేళ్ల ఓమర్ మహ్మద్ ఆల్ హజ్జాజ్ ఇలా తన వెంట్రుకలను కేవలం క్యాన్సర్ బాధితుల కోసమే పెంచుతున్నాడు.

మూడేళ్ల వయసు నుంచి ఇలాగే వెంట్రుకలను పెంచుతున్నాడు. ఇప్పటి వరకు మూడుసార్లు చారిటీలకు దానం చేశాడు. క్యాన్సర్ బాధితులకు అందించే కీమోథెరపీ వల్ల వారు తలనీలాలు కోల్పోయినప్పుడు వారికి స్వచ్ఛంద సంస్థల ద్వారా తన వెంట్రుకలు దానం చేస్తున్నాడు. ఒకసారి తన సమీప బంధువైన ఓ మహిళ క్యాన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకునే క్రమంలో తలనీలాలు కోల్పోవాల్సి వచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న ఓమర్ మహ్మద్ ఆల్ హజ్జాజ్ తన వెంట్రుకలను పెంచడం మొదలెట్టాడు. ఇలా పెంచిన వెంట్రుకలను చారిటీల ద్వారా క్యాన్సర్ బాధితులకు అందిస్తున్నాడు. చిన్న వయసులో గొప్ప మనసు చాటుకున్న ఓమర్‌కు ఆల్ బతీన్ ప్యాలెస్‌ నుంచి ఆహ్వానం అందింది.

ప్యాలెస్‌లో యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయి అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం.. అబుదాబి రాజు, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లను ఓమర్ తన కుటుంబంతో సహా కలిశాడు. ఈ సందర్భంగా ఓమర్‌‌ను దుబాయి అధినేతలు ప్రశంసలతో ముంచెత్తారు.

ఇంత చిన్న వయసులో ఎంతో గొప్ప ఆలోచనతో ప్రపంచాన్ని సంతోషంగా చూడాలనుకుంటున్న అతణ్ణి మెచ్చుకున్నారు. ఇక యూఏఈ అధినేతలతో కలిసి దిగిన ఓమర్ మహ్మద్ ఆల్ హజ్జాజ్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో భారీగా షేర్ కావడంతో మనోడు రాత్రికి రాత్రే దుబాయిలో సెన్సెషన్‌ బాయ్‌గా మారిపోయాడు.