ఉబర్‌‌‌‌ సరికొత్త పాలసీ... ప్రయాణికులకు డ్రైవర్ల రేటింగ్

SMTV Desk 2019-06-01 14:09:15  uber,

రైడ్ హైరింగ్ దిగ్గజం ఉబర్‌‌‌‌ సరికొత్త పాలసీని తీసుకు వచ్చింది. ఇక నుంచి డ్రైవర్లు కూడా ప్రయాణికులకు రేటింగ్ ఇచ్చేలా ఈ పాలసీ ఉంది. రైడర్లు, డ్రైవర్లు ఒకరికొకరు రేటింగ్స్‌‌ను ఇచ్చుకోనున్నారు. వచ్చే కొన్ని వారాల్లో లేదా నెలల్లో ఈ పాలసీ అమల్లోకి వస్తుంది. యావరేజ్ రేటింగ్‌‌ కంటే రైడర్లు ఎవరికైనా తక్కువ రేటింగ్ ఉంటే, తమ యాప్ ఎకో సిస్టమ్‌‌ నుంచి గెంటివేసే ప్రమాదముందని ఉబర్‌‌‌‌ ప్రకటించింది. ఇన్ని రోజులు డ్రైవర్లకు మాత్రమే తక్కువ రేటింగ్స్‌‌పై భయముండేది. ఇక నుంచి రైడర్స్ కూడా రేటింగ్స్‌‌ విషయంలో భయపడాల్సి వస్తుంది. రేటింగ్స్ తక్కువుంటే, రైడర్స్‌‌ను డియాక్టివేట్ చేయనుంది ఉబర్. రైడర్లు, డ్రైవర్లు పరస్పరం రేటింగ్ ఇచ్చుకునే ఈ సిస్టమ్‌‌.. సురక్షితమైన, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని ఉబర్ చెప్పింది.

రేటింగ్స్ పెంచుకునే విషయాలపై రైడర్స్‌‌కు టిప్స్‌‌ కూడా అందిస్తోంది. మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, స్పీడ్ పరిమితిని పెంచేలా డ్రైవర్లను కోరకుండా ఉండటం వంటి వాటితో రైడర్లు తమ రేటింగ్స్‌‌ను పెంచుకోవచ్చని ఉబర్ సేఫ్టీ బ్రాండ్ అండ్ ఇనిషియేటివ్స్ హెడ్ కేట్ పార్కర్ చెప్పారు. రేటింగ్ 5 లో 4.6 కంటే తక్కువ రేటింగ్ వస్తే ఉబర్‌‌‌‌ డ్రైవర్లు డియాక్టివేషన్ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని 2015 లీక్డ్ డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అయితే రైడర్లకు ఇది ఎంత ఉండొచ్చన్నది తెలియరాలేదు. అవసరం లేకుండా క్యాన్సిలేషన్స్‌‌ చేపట్టవద్దని రైడర్లకు ఉబర్ చెబుతోంది.