కాంగ్రెస్ కార్యాలయం ఎదురుగా రాఫెల్ యుద్ధ విమానం నమూనా.. సోషల్ మీడియాలో వైరల్

SMTV Desk 2019-06-01 14:06:42  rafale deal

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మారిన రాఫెల్ యుద్ధం విమానం... ఇప్పుడు అదే పార్టీ ఆఫీసు ముందు నమూనాగా దర్శనమిస్తోంది. భారత వాయుసేన (ఐఏఎఫ్) చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా అధికారిక నివాసం ముందు రాఫెల్ యుద్ధ విమానం నమూనా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న సుఖోయ్ ఎస్‌యూ-30 యుద్ధ విమానం నమూనాను తొలగించి మరీ ఆ స్థానంలో రాఫెల్ విమానం నమూనా నెలకొల్పడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి ఎదురుగా కూతవేటు దూరంలోనే వాయుసేన చీఫ్ నివాసం ఉంది. దీంతో ప్రతిపక్షాన్ని ఎద్దేవా చేసేందుకే ఇక్కడ రాఫెల్ ప్రతిమను ఏర్పాటు చేశారా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దసో ఏవియేషన్‌కు ఆఫ్‌సెట్ భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీని ఎన్నుకోవడంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపిస్తోంది. అయితే ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను కేంద్రం ఖండిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికల్లా తొలి రాఫెల్ విమానం దేశానికి రానుంది. రాఫెల్ యుద్ధ విమానాలు అందుబాటులోకి వస్తే భారత్ మరింత మెరుగైన ఫలితాలు సాధించగలమంటూ వాయుసేన చీఫ్ ధనోవా తరచూ చెబుతున్న సంగతి తెలిసిందే.