విదేశాంగ మంత్రి తొలి ట్వీట్ ఇదే..!

SMTV Desk 2019-06-01 14:05:35  foreign affairs

భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. జయశంకర్ ఇవాళ తొలిసారి ట్విటర్ వేదికగా స్పందించారు. తనకంటే ముందు విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ అడుగు జాడల్లో తాను నడవడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కేంద్ర విదేశాంగ కార్యదర్శిగా విశేష సేవలు అందించిన జయశంకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్యంగా తన మంత్రిమండలిలోకి తీసుకుని యావద్దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.

‘‘ఇదే నా తొలి ట్వీట్. శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు! ఈ బాధ్యత నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. సుష్మా స్వరాజ్ అడుగుజాడల్లో నడవడం పట్ల గర్వంగా ఉంది..’’ అని జయశంకర్ ట్వీట్ చేశారు. ‘‘ఒకే జట్టుగా విదేశాంగ శాఖ సేవలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. నా సహచరుడు మురళీధరన్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది...’’ అని మరో ట్వీట్‌లో జయశంకర్ పేర్కొన్నారు.