ఆర్దికమంత్రిగా నిర్మలా .. 118 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

SMTV Desk 2019-06-01 13:50:15  sensex, lost,

న్యూఢిల్లీ : కేంద్రంలో మంత్రులకు శాఖల కేటాయింపుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. శుక్రవారం ఉదయం కొనుగోళ్ల అండతో సూచీలు సరికొత్త రికార్డులతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సూచీలు మంచి లాభాలతో కొనసాగాయి. అయితే మధ్యాహ్నం నుంచి నష్టాల్లోకి జారుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 118 పాయింట్లు నష్టపోయి 39,714 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 23 పాయింట్ల నష్టంతో 11,923 వద్ద స్థిరపడింది. ఓ దశలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభపడిన కీలక 40వేల మార్క్‌ను దాటింది.

అటు నిఫ్టీ కూడా 12వేల మార్క్‌పైన కదలాడింది. అయితే మధ్యాహ్నం సమయంలో మోడీ కేబినెట్ శాఖల కేటాయింపుతో సూచీలు ఒక్కసారిగా ఒడుదొడుకులకు గురయ్యాయి. నిర్మలా సీతారామన్‌కు ఆర్థికమంత్రి బాధ్యతలు ఇవ్వడంపై మదుపర్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. మరోవైపు లోహ, ఆర్థిక రంగాల షేర్లు నష్టపోవడంతో మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా సూచీలు నష్టపోయాయి. ఓ దశలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివర్లో ఐటీ రంగ షేర్లలో మళ్లీ కొనుగోళ్లతో సూచీలు కాస్త కోలుకున్నా లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ప్రధానంగా టెక్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్, టిసిఎస్, బ్రిటానియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి. యస్ బ్యాంక్, ఐటిసి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, వేదాంతా, జి ఎంటర్‌టైన్‌మెంట్స్ షేర్లు నష్టపోయాయి.