నాదల్, ఫెదరర్ జయకేతనం

SMTV Desk 2019-06-01 13:47:38  nadal, federar,

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) విజయం సాధించారు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్‌లో నాదల్, ఫెదరర్ జయకేతనం ఎగుర వేశారు. ఇక, మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కరొలినా ప్లిస్కోవా మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. పెట్రా మార్టిక్‌తో జరిగిన పోరులో ప్లిస్కోవా కంగుతింది. మరోవైపు మాజీ ఛాంపియన్ గాబ్రియెన్ ముగురుజా (స్పెయిన్) నాలుగో రౌండ్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ నిషికోరి (జపాన్) చెమటోడ్చి విజయం సాధించాడు. సెర్బియా ఆటగాడు లాసియో డెరెతో జరిగిన పోరులో నిషికోరి అతి కష్టం మీద గట్టెక్కాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో నిషికోరి 64, 67, 63, 46, 86తో విజయం సాధించాడు. ప్రతి సెట్‌లో పోరు ఉత్కంఠభరితంగా సాగింది.

తొలి సెట్‌లో నిషికోరి గెలువగా, తర్వాతి సెట్‌లో లాసియో విజయం సాధించాడు. మూడో సెట్‌లో మళ్లీ నిషికోరి గెలిచాడు. నాలుగో సెట్‌లో మళ్లీ ప్రత్యర్థి పైచేయి సాధించాడు. ఇక, ఫలితాన్ని తేల్చే ఐడో సెట్‌లోనూ పోరు హోరాహోరీగా సాగింది. చివరికి నిషికోరి గట్టెక్కాడు. ఇక, డిఫెండింగ్ చాంపియన్ నాదల్ మూడో రౌండ్‌లో పెద్దగా చెమటోడ్చకుండానే విజయం సాధించాడు. బెల్జియం ఆటగాడు డేవిడ్ గోఫిన్‌తో జరిగిన పోరులో నాదల్ 61, 63, 46, 63తో జయభేరి మోగించాడు. ప్రారంభం నుంచే నాదల్ దూకుడును ప్రదర్శించాడు. అలవోకగా రెండు సెట్లు గెలుచుకున్నాడు. కానీ, మూడో సెట్‌లో అతనికి చుక్కెదురైంది. అయితే నాలుగో సెట్‌లో మళ్లీ గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, మూడో సీడ్ ఫెదరర్ కూడా సునాయాస విజయంతో నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. నార్వే ఆటగాడు కార్పర్ రూడ్‌తో జరిగిన పోరులో ఫెదరర్ 63, 61, 76తో విజయం సాధించాడు.