గూఢచర్యం కేసులో.. ఇద్దరు అధికారులకు మరణశిక్ష, ఒకరికి జీవితఖైదు విధించిన పాకిస్థాన్ ఆర్మీ

SMTV Desk 2019-06-01 13:15:21  pakistan

దేశ రహస్యాలను విదేశీ ఏజెన్సీలకు అందించారనే కారణంతో పాకిస్థాన్ ఆర్మీ ముగ్గురికి శిక్షలు విధించింది. గూఢచర్యం చేసిన కేసులో ఓ ఆర్మీ జనరల్ కు జీవితఖైదు విధించింది. ఇదే కేసులో ఓ బ్రిగేడియర్ కు, మరో అధికారికి మరణశిక్షను విధించింది. మిలిటరీ ట్రయల్ కోర్టు ఈ శిక్షలను విధించిన విషయాన్ని పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా ధ్రువీకరించినట్టు మిలిటరీ ఓ ప్రకటనలో తెలిపింది.

రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ జావెద్ ఇక్బాల్ కు జీవిత ఖైదు విధించారు. పాక్ చట్టాల ప్రకారం ఆయన 14 ఏళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. రిటైర్డ్ బ్రిగేడియర్ రజా రిజ్వాన్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వసీం అక్రంలకు మరణశిక్షను విధించారు. అయితే ఎలాంటి సమాచారాన్ని లీక్ చేశారు? ఎవరికి సమాచారాన్ని అందించారు? అనే విషయాలను మాత్రం పాక్ ఆర్మీ వెల్లడించలేదు.

పాకిస్థాన్ ఆర్మీకి సొంత చట్టాలు, కోర్టులు ఉంటాయి. తప్పులు చేసిన మిలిటరీ అధికారులను సొంత కోర్టుల్లోనే విచారిస్తారు. మిలిటరీ నిబంధనల ప్రకారమే ఈ తీర్పులను ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది.