రికార్డులకెక్కిన నిర్మలా సీతారామన్!

SMTV Desk 2019-06-01 12:40:28  nirmala sitharaman

అందరూ ఊహించినదే జరిగింది. బీజేపీని రెండోసారి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన అమిత్ షాకు కీలక పదవి దక్కింది. కేంద్రమంత్రి వర్గంలోనే అత్యంత ముఖ్యమైన హోంమంత్రి పదవీ బాధ్యతలను ఆయన అందుకున్నారు. గతంలో అదే శాఖ నిర్వహించిన రాజ్‌నాథ్‌ సింగ్‌కు రక్షణ శాఖ కేటాయించగా, ఇప్పటి వరకు రక్షణ మంత్రిగా వ్యవహరించిన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖను మోదీ అప్పగించారు. అలాగే, సుష్మాస్వరాజ్ నిర్వహించిన విదేశీ వ్యవహరాల శాఖను ఆ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం జయశంకర్‌కు అప్పగించారు.

ఆర్థిక శాఖ చేపట్టబోతున్న నిర్మలా సీతారామన్ రికార్డు పుటల్లోకి ఎక్కారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న రెండో మహిళాగా చరిత్ర సృష్టించారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1970లో ఏడాదిపాటు ఈ బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ప్రధాని నరేంద్రమోదీ సూచన మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శాఖలు కేటాయించారు. వీరిలో 24 మంది కేబినెట్ మంత్రులు కాగా, 9 మంది స్వతంత్రులు. 24 మంది సహాయ మంత్రులు ఉన్నారు.